పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తికి కొమరంభీమ్ జాతీయ పురస్కారం

- October 05, 2017 , by Maagulf
పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తికి కొమరంభీమ్ జాతీయ పురస్కారం

నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తికి కొమరం భీమ్‌ జాతీయ పురస్కారం వరించింది. నేడు(శుక్రవారం) కొమరం భీమ్‌ వర్థంతిని పురస్కరించుకుని ఈఏడాదికిగానూ ఈ జాతీయ అవార్డుకు పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తిని ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ చైర్మెన్‌, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రకటించారు. తెలంగాణ టెలివిజన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌, ఆదివాసి సాంస్కృతిక పరిషత్‌, గోండ్వానా కల్చరల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, భారత్‌ కల్చరల్‌ అకడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది ఈ ప్రతిష్టాత్మక 'కొమరం భీమ్‌' జాతీయ పురస్కారాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా కె.వి.రమణాచారి మాట్లాడుతూ, ''జల్‌ జంగిల్‌ జమీన్‌' నినాదంతో గోండు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సాయుధ పోరాటం చేసిన అమరయోధుడు కొమరం భీమ్‌ ఆశయ సాధనలో, ఆయన స్ఫూర్తితో ఆర్‌.నారాయణమూర్తి పలు చిత్రాలను నిర్మించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. 'అర్థరాత్రి స్వతంత్య్రం', 'అడివి దివిటీలు', 'లాల్‌ సలాం', 'ఎర్రసైన్యం', 'చీమలదండు', 'చీకటి సూర్యులు', 'ఊరు మనదిరా', 'వేగుచుక్కలు', 'అరణ్యం', 'ఎర్రోడు', 'సింగన్న' వంటి పలు విజయవంతమైన చిత్రాలు కొమరం భీమ్‌ ఆశయాలకు అనుగునంగా రూపొందించినవే. అందుకే ఈ ఏడాదికిగానూ అవార్డును ఆర్‌.నారాయణమూర్తికివ్వడం సమంజసమని నమ్ముతున్నాం' అని అన్నారు. 'గతంలో ఈ అవార్డును 'కొమరం భీమ్‌' చిత్ర దర్శకుడు, నిర్మాత అల్లాణి శ్రీధర్‌, గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అందుకున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ అవార్డు ఫంక్షన్‌ జరుగుతుంది.

ఈ అవార్డు కింద 51వేల రూపాయల నగదు, జ్ఞాపిక పత్రంతో సత్కరించనున్నాం' అని కన్వీనర్‌ నాగబాల సురేష్‌ కుమార్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com