భారత్‌-ఆస్ట్రేలియా చివరి టీ ట్వంటీ ఉప్పల్ స్టేడియంలో

- October 12, 2017 , by Maagulf
భారత్‌-ఆస్ట్రేలియా చివరి టీ ట్వంటీ ఉప్పల్ స్టేడియంలో

రెండు టీమ్స్‌లోనూ టీ ట్వంటీ స్టార్స్‌...సిరీస్‌ను డిసైడ్ చేసే మ్యాచ్‌... ఇంక క్రికెట్ వినోదానికి కొదవేముంది...ఈ వినోదానికి వేదిక కాబోతోంది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం.. భారత్‌, ఆసీస్ చివరి టీ ట్వంటీకి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నవేళ వరుణుడు మాత్రం టెన్షన్ పెడుతున్నాడు.

భారత్‌, ఆస్ట్రేలియా చివరి టీ ట్వంటీ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం సిధ్ధమైంది. ఇరు జట్లూ చెరొక మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టిన కోహ్లీసేన తర్వాత మాత్రం చేతులెత్తేసింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో అభిమానులను నిరాశపరిచింది. అయితే హైదరాబాద్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్ళూరుతోంది. వర్షం కారణంగా గురువారం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేకపోయినా... టీమిండియానే ఫేవరెట్‌గా చెప్పొచ్చు. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఉన్న కోహ్లీసేనకు గత రికార్డులు కూడా అనుకూలంగా ఉన్నాయి. షార్ట్ ఫార్మేట్‌లో కంగారూలపై మంచి రికార్డున్న భారత్ మరోసారి దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించినప్పటకీ... సిరీస్‌ డిసైడర్‌లో భారత్ తుది జట్టును మార్చే అవకాశం లేదని భావిస్తున్నారు.

మరోవైపు భారత పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయాన్ని రుచి చూసిన ఆస్ట్రేలియా చివరి టీ ట్వంటీలో గెలిచి ట్రోఫీతో స్వదేశానికి తిరిగివెళ్ళాలని ఎదురుచూస్తోంది. గత మ్యాచ్‌లో బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించడంతో స్కోర్ సమం చేసిన ఆసీస్ మరోసారి అటువంటి ప్రదర్శనే రిపీట్ చేయాలనుకుంటోంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడిన డేవిడ్‌వార్నర్‌కు ఉప్పల్ స్టేడియంలో అద్భుతమైన రికార్డుండడం ఆసీస్‌కు అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే వరుణుడు మ్యాచ్‌కు అడ్డుపడే అవకాశాలున్నాయి. మ్యాచ్‌కు ముందురోజు కూడా వర్షం కురవడంతో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పిఉంచారు. అయితే అత్యున్నత డ్రైనేజ్ సిస్టమ్ ఉండడంతో వర్షం కురిసినా..15 నిమిషాల్లోనే గ్రౌండ్ సిధ్ధం చేస్తామని హెచ్‌సిఎ సెక్రటరీ చెబుతున్నారు.

ఇక మ్యాచ్‌ కోసం చేసిన భద్రతా ఏర్పాట్లపై  రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్‌ స్టేడియంలో స్వయంగా సమీక్షించారు. ఆటగాళ్ళ సెక్యూరిటీతో పాటు అభిమానులను ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com