భారత్‌ చేతికి శ్రీలంక ఎయిర్‌పోర్టు నిర్వహణ

- October 13, 2017 , by Maagulf
భారత్‌ చేతికి శ్రీలంక ఎయిర్‌పోర్టు నిర్వహణ

పొరుగుదేశాలను కలుపుకుతూ ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ నిర్మిస్తున్న చైనాకు.. భారత్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. శ్రీలంకలోని హంబన్‌తోట ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న ఓడరేపుకు సమీపంలోని మట్టాల ఎయిర్‌పోర్టును ఆధునీకరించేందుకు భారత్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను భారీ నిధులతో అభివృద్ధి చేసి నిర్వహణ వ్యవహారాలను భారత్‌ పర్యవేక్షించేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని శ్రీలంక పౌరవిమానయాన శాఖ మంత్రి నిమల్‌ సిరిపాల ప్రకటించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ, ఆధునికీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను భారత్‌ ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ, అభివృద్ధి విషయంలో భారత్‌లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన ప్రకటించారు.

హంబన్‌తోట ఓడరేవు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవుల్లో ఒ‍కటి. ఆసియా, ఐరోపాల మధ్య జలరవాణకు ఈ ఓడరేవు ఒక వారధిలా వ్యవహరిస్తోంది. చైనా ఇక్కడే ఒన్‌బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం చైనా 15 వేల ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు శ్రీలంక ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. ఇక్కడేఘొక భారీ నూనె శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. చైనాకు పెద్ద ఎత్తున భూమికి లీజుకు ఇవ్వడంపై స్థానికులు ఆందోళన చేస్తున్నారు. చైనా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం తరువాత అత్యంత ముఖ్యమైనది మట్టాల విమానాశ్రయమే. అయితే ఇది కొంతకాలంగా నష్టాలతోనూ, ఇతర సమస్యల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో దీనిని అభివృద్ధి చేసి, నిర్వహణ చేపట్టుందుకు శ్రీలంకతో కలిసి భారత్‌ పనిచేయనుంది. ఈ విమానాశ్రయాన్ని భారత్‌కు శ్రీలంక 40 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మట్టాలా విమానాశ్రమం అభివృద్ధికి తన వాటాగా భారత్ 70 శాతం పెట్టుబడిని పెట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com