దేశ రాజధాని దిల్లీలో తెలుగు మహాసభల సందడి

- November 05, 2017 , by Maagulf
దేశ రాజధాని దిల్లీలో తెలుగు మహాసభల సందడి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వేదికగా డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ ప్రభుత్వం దిల్లీలోని తెలుగువారిని ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖలు ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి తెలంగాణ భవన్‌లో ప్రత్యేక ఆహ్వాన సమావేశం ఏర్పాటుచేసి భాషాభిమానులకు స్వాగతం పలికింది. ఇందులో ప్రముఖ కవి, గాయకుడు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణలో వర్ధిల్లుతున్న తెలుగుభాష, సంస్కృతుల గొప్పతనాన్ని ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు ఖ్యాతి, తెలంగాణ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు సీఎం కేసీఆర్‌ విశేషంగా కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగులో మొదటి స్వతంత్ర కావ్యం తెలంగాణ నుంచే వచ్చిందని, అనేక ప్రక్రియలు తెలంగాణలోనే తొలిసారిగా వెలువడ్డాయన్నారు. తెలుగుభాషలో ప్రత్యామ్నాయ పదాల శోధనకు శాశ్వత తెలుగు నిఘంటువు రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో అధికార, న్యాయపరమైన విషయాల్లో తెలుగు అధికారికంగా ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి ఆరువేల మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. దిల్లీ నుంచి మహాసభలకు హాజరయ్యే ప్రతినిధుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు.

తెలంగాణభవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి మాట్లాడుతూ..మహాసభల ప్రారంభానికి ముందు దాకా పేర్లు నమోదుచేసుకోవచ్చని చెప్పారు.
'చెన్నైలో తెలంగాణ భవన్‌ నిర్మించాలి': చెన్నైలో తెలంగాణభవన్‌ నిర్మించాలని అక్కడ ఉంటున్న తెలంగాణ వాసులు కోరారు. మహాసభల సన్నాహక సమావేశానికి అక్కడికి వెళ్లిన దేశపతి శ్రీనివాస్‌, మామిడి హరికృష్ణలను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. తమకు తెలంగాణలో మాదిరే ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా చూడాలని తమిళనాడులోని తెలంగాణ జిల్లాలకు చెందిన క్యాబ్‌డ్రైవర్లు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com