పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిపిన తాజా భేటీ
- November 12, 2015
ప్రశ్నించడమే పరమావధిగా పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిపిన తాజా భేటీ రాజకీయ వర్గాల్లో శతసహస్ర సందేహాలను లేవనెత్తుతోంది. ఎన్నో సమస్యలు, సందేహాలు, ప్రభుత్వ విధానాలపై వివాదాలు ఉన్పప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా కేవలం చుట్టపుచూపుగా ఈ నేతల సమావేశం సాగిపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రెండు గంటల పాటు సాగిన ముఖాముఖిలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయం అంతర్గతమే అయినప్పటికీ బహిరంగంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన సైతం నిరాశ పరిచిందనేది విమర్శ. ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రశ్నిస్తానని..... ఎన్నికల్లో తెలుగుదేశంతో జట్టు కట్టి ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పార్టీ జన సేన. ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రశ్నిస్తానని పవన్ అప్పట్లోనే ప్రకటించారు. రాజకీయ విమర్శకులు సైతం ఈ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేశారు. జనసేన వాచ్ డాగ్ గా పనిచేస్తుందని భావించారు. అయితే పార్టీ నిర్మాణం లేకపోవడం ..పవన్ కల్యాణ్ సినీ రంగానికే అంకితమై పోవడం వల్ల ఏడాదిన్నర కాలంలో రాజకీయంగా సాధించిందేమీ లేకుండా పోయింది. ట్విట్టర్ లో చిలక పలుకులకే పరిమితమై పోయారాయన. మధ్యలో ఒకసారి కొన్ని గ్రామాల రైతుల భూసేకరణ విషయంలో రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పవన్ సూచన మేరకే భూసేకరణ నుంచి విరమించుకుంటున్నామని మంత్రుల ద్వారా ప్రకటింపచేసింది. దీంతో సందడి సద్దుమణిగిపోయింది. బాక్సైట్ తవ్వకాలపై పెగలని పవన్ నోరు..... తాజాగా ప్రభుత్వం మరోసారి తన అజెండాను అమలు చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు భూసేకరణ అస్త్రంతో మరిన్ని భూములను రాజధానికి సమీకరించాలని ప్రయత్నిస్తోంది. ఇంకో వైపు అమాయక గిరిజనులను నిరాశ్రయులను చేసేలా.. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే.. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని భూములను 99 ఏళ్ల వరకూ కార్పొరేట్ సంస్థలకు లీజు రూపంలో అప్పగించేందుకు సంసిద్ధమవుతోంది. ఇంతటి వివాదాస్పద అంశాల నేపథ్యంలో... సీఎం-పవన్‌ల భేటీపై రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తి వ్యక్తమయ్యింది. ప్రజల పక్షాన ప్రభుత్వం ముందు ఆయన ఎన్నో డిమాండ్లు పెడతారన్న అభిప్రాయం, ఆశ వ్యక్తమయ్యాయి. కానీ ఇద్దరి భేటీ తర్వాత ఈ నమ్మకం వమ్మయిపోయింది. ఆశ నిరాశగా మిగిలిపోయింది. రాజధాని శంకుస్థాపనకు రాలేకపోయానని, అందుకుగాను ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చానని నీరుగార్చేశారు పవన్. నిస్పహాయతలో పవన్ కల్యాణ్ ..... బాక్సైట్ తవ్వకాల వంటి కీలక నిర్ణయాల విషయంలోనూ సర్కారును నిలదీయలేని నిస్పహాయతలో పవన్ కల్యాణ్ చిక్కుకుపోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాక్సైట్ విషయం ఈనాటిది కాదని వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనిదని ఆయన ముక్తాయించారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ప్రబుత్వ విధానాలను సమర్థిస్తున్నట్లుగానే మాట్టాడారు. గిరిజనులు నిరాశ్రయులు కాకుండా వారికి అన్యాయం జరగకుండా వారి సమ్మతితోనే తవ్వకాలు జరుపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని జనసేనాని చెప్పుకొచ్చారు. అంటే తవ్వకాలు ఖాయం అన్న విషయం ఆయన మాటల్లోనే ధ్వనించింది. పార్టీ నిర్మాణంపైనా సందేహాలే...... ఒక రాజకీయ పార్టీ నేతగా కీలక మైన అంశాలను పక్కన పెట్టి చుట్టం చూపుగా పర్యటనకు చాప చుట్టేయడం.. ఒక్క మాటంటే ఒక్క మాట కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించక పోవడం, కనీసం సలహా, సూచన ఇచ్చే సాహసం కూడా చేయకపోవడం పై పార్టీ అభిమానుల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వాన్ని సైతం తొందరపడి విమర్శించదలుచుకోలేదని విస్పష్టంగా ప్రకటించడాన్ని బట్టి చూస్తుంటే .. .జన సేనాని ఇప్పట్లో జనం అజెండాను తన జెండా గా మార్చుకునే అవకాశం లేదని తేటతెల్లమవుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







