అమెరికన్ బృందంలో అంతంత కీలకమైన వ్యక్తి ఇవాంకా..అయిదంచెల భద్రత

- November 24, 2017 , by Maagulf
అమెరికన్ బృందంలో అంతంత కీలకమైన వ్యక్తి ఇవాంకా..అయిదంచెల భద్రత

హైదరాబాద్: ఆమె కోసం భాగ్యనగరం ఎదురుచూస్తోంది. ఆమె వస్తోందని తెలిసి మాదాపూర్‌, మరికొన్ని ప్రాంతాలు అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్నాయి. చార్మినార్‌ వద్ద ఏకంగా ఓ మాల్‌నే ఏర్పాటు చేశారు. రోడ్లపై బిచ్చగాళ్లను చూసి ఏమనుకుంటుందో అనే అనుమానంతో కనిపించిన ప్రతి బిచ్చగాడినీ జైలుకు పంపించారు.
ఇవాంకా రాక దగ్గర పడిందని తెలియగానే హై అలర్ట్ ప్రకటించారు. భాగ్యనగరమంతటినీ జల్లెడ పడుతున్నారు. ఆమె వెళ్లే మార్గమంతా రాకపోకలు బంద్‌. హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్‌నుమా దాకా 4 కిలోమీటర్ల పరిధిలో వాహనాలు నిషేధం.. ఇదంతా ఎవరికోసం అంటే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్‌ కోసం.

ఇవాంకా ట్రంప్.. ఈ నెల 28 నుంచి మూడ్రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న అమెరికా-భారత్‌ వాణిజ్య సదస్సుకు హాజరవుతోంది. 350 మందితో కూడిన అమెరికన్‌ బృందానికి ఇవాంకాయే నాయకత్వం వహిస్తోంది. పేరుకి ఆమె అమెరికా అధ్యక్షుడి సలహాదారు.. కానీ అధ్యక్షుడికి అత్యంత నమ్మకస్తురాలైన వ్యక్తి. ఇవాంకా కనుసన్నల్లోనే కీలక విభాగాలన్నీ నడుస్తుంటాయి.. ఆమె సమక్షంలోనే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు. అమెరికాకు సంబంధించినంత వరకూ... అధ్యక్షుడి తరువాతి స్థానం ఆమెదే! ట్రంప్‌ భార్య, ఫస్ట్‌ లేడీ మెలీనియా కంటే ఇవాంకాకే అన్నిటా ప్రాధాన్యం మరి! అంతటి ప్రాధాన్యమున్న వ్యక్తిగనకనే మనదేశంలో ఆమెకు అమెరికా అధ్యక్షుడికిచ్చినంత గౌరవమర్యాదలు. ఆమె ట్రంప్‌కు సలహాదారే అయినా ఇక్కడ మాత్రం ఆమెకు ట్రంప్‌ కుమార్తె హోదాలోనే స్వాగతం, భద్రత, ట్రీట్‌మెంట్‌ ఉంటాయి.

ఇవాంకా అమెరికా అధ్యక్షుడికి సలహాదారు మాత్రమే. మరి సలహాదారుగా అయితే ఆమెకు కేవలం ఓ దేశ రాయబారికి లభించే భద్రత, హోదాలే ఉంటాయి. కానీ ఇవాంకా హైదరాబాద్‌ రావడం వెనుక కొంత కసరత్తు జరిగింది. ఈ ఏడాది జూన్‌ 24న ప్రధాని నరేంద్ర మోడీ శ్వేతసౌధాన్ని సందర్శించినపుడే ఇవాంకా భారత పర్యటన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ట్రంప్‌ ప్రస్తుతానికి భారత్‌ వచ్చే అవకాశాల్లేవని తేలడంతో.. ప్రధాని మోడీయే ఇవాంకాను పంపండని ప్రతిపాదించారు. అమెరికా ప్రభుత్వంలో ఇవాంకాకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అంచనా వేశాకే మోడీ ఈ ప్రతిపాదన చేసి ఉంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా రాయబారి కార్యాలయాన్ని ఇవాంకా సందర్శించి.. చైనీయుల నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. చైనాలో తయారయ్యే అనేక ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో గేమ్స్‌ లాంటివి ఆమెను ఆకర్షించాయి.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ నిర్వహణను ఒక సవాలుగా తీసుకున్నారు. సదస్సును అత్యుత్తమ స్థాయిలో నిర్వహించాలని పలు విభాగాలకు ఆదేశాలిచ్చారు. నీతి ఆయోగ్‌ కూడా ఆ దిశగానే కసరత్తు చేసింది. బెస్ట్‌ అనుకున్న సంస్థలు, వ్యక్తులను ఆహ్వానించింది. సదస్సు నినాదం- విమెన్‌ ఫస్ట్‌ కూడా ఇవాంకాను ఉద్దేశించే పెట్టారనవచ్చు. మహిళా సాధికారతను బలంగా కోరుకుంటున్న వ్యక్తి ఇవాంకా. 'విమెన్‌ ఇన్‌ వర్క్‌' పేరుతో ఇవాంకా ఇదివరకే ఒక పుస్తకం కూడా రాసింది. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందింది. మహిళలు ఎలా తలెత్తుకు తిరగాలి? సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి? వంటి విషయాలను ఆ పుస్తకంలో ఇవాంకా చక్కగా వివరించింది.

ఇవాంకా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనడంతో పాటు హైదరాబాద్‌లో ఎక్కడెక్కడకు వెళతారు, ఏమేం చూస్తారన్నది ఇప్పటికీ గోప్యంగానే ఉంది. ఆమెకు అయిదంచెల భద్రత కల్పిస్తున్నారు. అంటే దాదాపుగా అధ్యక్షుడి భద్రతతో సమానమన్నమాట. మొదటి రెండంచెలూ అమెరికా ప్రభుత్వ సీక్రెట్‌ సర్వీసే చూసుకుంటుంది. మూడో అంచెలో మన రాష్ట్రపతి, ప్రధాని లాంటి కీలక వ్యక్తులకు భద్రత కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పిజి) కమాండోలుంటారు. నాలుగో అంచెను తెలంగాణా ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ చూసుకుంటుంది. అయిదో లేయర్‌లో సైబరాబాద్‌ పోలీసులు పహారా కాస్తారు. ఇంత భద్రత ఉన్నా కూడా ఇవాంకా పర్యటనకు సంబంధించి అన్ని విషయాలను అమెరికా అధికారులు బయటికి లీక్ చేయడం లేదు.

మైన్‌ ఫ్రూప్‌ కార్లు, సెకన్లలో ఇతరుల ఆయుధాలను నిర్వీర్యం చేయగలిగిన లేజర్‌ వ్యవస్థలతో పాటు ఎటువంటి ప్రమాదాలనైనా పసికట్టే జాగిలాలు, అనుక్షణం పహరా కాసే సీక్రెట్‌ ఏజెంట్స్‌.. ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటనలో ఇవన్నీ ఒక భాగం. ఆమె బులెట్‌ ప్రూఫ్‌ కార్లను అమెరికన్‌ ప్రభుత్వమే తెచ్చుకుంటుంది. అధ్యక్షుడి కుటుంబానికి ఇచ్చే భద్రత అక్కడి ప్రాథామ్యాంశాల్లో ఒకటి.. ట్రంప్‌, ఆయన ఫ్యామిలీ భద్రతావసరాల కోసం 120 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను కాంగ్రెస్‌ ఆమోదించింది.

ఈ ఏడాది మార్చిలో ఇవాంకా, ఆమె సోదరుడు ఎరిక్‌ కుటుంబాలు అమెరికాలోని యాస్పిన్‌ మంచుకొండలలో స్కీయింగ్‌కు వెళ్లాయి. ఆరు రోజుల వీరి వెకేషన్‌ కోసం అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ 3.3 లక్షల డాలర్లు (దాదాపు రెండు కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది. ఇప్పుడు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన కోసం అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అంతకంటే ఎక్కువే ఖర్చు పెడుతుందని ఒక అంచనా. ఎందుకంటే ఇది విదేశీ పర్యటన. అందునా సెక్యూరిటీ రిస్క్‌లు ఎక్కువ ఉండే ప్రాంతం. అమెరికా బృందానికి నేత కాబట్టి ఆ హోదాలో ఆమె ప్రధాని మోడీతోనూ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌తోనూ, ఇతర ప్రభుత్వ పెద్దలతోను సంప్రదింపులు జరుపుతారు. ఆమె ఉత్సాహంగా దీనికి హాజరవుతుండడానికి ఇది కూడా ఓ కారణం. ఇవాంకా వెంట ఆమె భర్త, అమెరికా ప్రభుత్వంలో మరో సలహాదారు అయిన జెరేడ్ కుష్నర్‌ కూడా వస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com