హైద‌రాబాద్‌లో మొద‌లైన మెట్రో ప‌రుగులు

- November 28, 2017 , by Maagulf
హైద‌రాబాద్‌లో మొద‌లైన మెట్రో ప‌రుగులు

ఇక భాగ్యనగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు కాలం చెల్లినట్టే.. సుఖవంతమైన ప్రయాణం సిటీ వాసుల సొంతమైంది.. ఎలాంటి బాదరబందీ లేకుండా హ్యాపీగా జర్నీ చేసే ఛాన్స్‌ వచ్చేసింది.. హైదరాబాదీల చిరకాల స్వప్నం నెరవేరింది. హైదరాబద్‌లో మెట్రో రైలు తొలి పరుగు మొదలైంది.. కొద్దిసేపటి నుంచే మెట్రో రైలు సేవలు భాగ్యనగర వాసులకు అందుబాటులోకి వచ్చాయి.. ఆరు గంటల నుంచి మొదటి బండి పట్టాలపై పరుగులు పెడుతోంది.

రోజూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మెట్రో రైలు నర్వీసులు నడవనున్నాయి.. మొత్తం 18 రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి.. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అతి త్వరలోనే ఈ సమయాన్ని మరికొంత పెంచనున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇక ఒక్కో రైలుకు మూడు కోచ్‌లు ఉంటాయి.. ఒక్కో కోచ్‌లో 330 మంది వరకు ప్రయాణం చేయొచ్చు. అంటే ఒక్క మెట్రో రైలులో వెయ్యి మంది వరకు జర్నీ చేయొచ్చు.

ఇక హైదరాబాద్‌ మెట్రో రైలు మొత్తం 100 మంది లోకో పైలెట్లను నియమించుకుంది.. ఇందులో 35 మంది మహిళలే ఉన్నారు. ఇప్పుడు పట్టాలపై పరుగులు పెట్టే మెట్రో ట్రైన్లకు లోకో పైలట్‌లు మహిళలే కావడం విశేషం. ఇప్పటికే ట్రయల్‌ రన్‌లో వీరు వేల కిలోమీటర్లు మెట్రోను నడిపారు.

మరోవైపు మెట్రో రైలుకు సంబంధించి గానీ, ప్రయాణానికి సంబంధించి గానీ, లేదంటే ఎలాంటి సమస్యలున్నా తెలుసుకునేందుకు వీలుగా హెల్ప్‌లైన్‌ నంబరును తీసుకొచ్చింది హెచ్‌ఎంఆర్‌ సంస్థ. 040-27772999  నంబరుకు కాల్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com