అమెరికా తీరును ఖండించిన భద్రతా మండలి
- December 09, 2017
న్యూయార్క్ : ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంకు అమెరికా గుర్తింపు ఇవ్వటంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా మండిపడింది. ప్రపంచ శాంతికి ఇదెలా దోహదం చేస్తుందని సభ్య దేశాల ప్రతినిధులు ఇటు ఐరాసను, అటు అమెరికాను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మధ్యప్రాచ్యంలో పెద్ద చిచ్చు రేపిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. జెరూసలేంపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో శుక్రవారంనాడు భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాయి. శుక్రవారం నాటి సమావేశంలో సభ్యదేశాలన్నీ ఇజ్రాయిల్‌పై వైట్‌హైస్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించాయి.
ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య చర్చల ద్వారా జెరూసలేం సమస్య పరిష్కారం కావాలి తప్ప, ఇలా కాదని...యూరోపియన్ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇజ్రాయిల్-పాలస్తీనా రెండు దేశాల సమస్య, ఆ రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకునే సమస్య అన్నదే తమ స్పష్టమైన విధానమని ఈయూ దేశాలు శుక్రవారం భద్రతా మండలి సమావేశం ముగిసిన తర్వాత ఓ ప్రకటన చేశాయి. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను తాము గుర్తించమని ఈ ప్రకటనలో ఈయూ తెలిపింది. ఆ నగరంపై ఇజ్రాయిల్‌కు ఎలాంటి సార్వభౌమాధికారం లేదని స్పష్టం చేసింది.
అయితే శుక్రవారంనాడు ఐరాస భద్రతా మండలి సమావేశం వాడివేడిగా జరిగినప్పటికీ సంయుక్త ప్రకటనేదీ విడుదల కాలేదు. ఒక నిర్మాణాత్మక వైఖరితో కూడిన ప్రకటన వెలువడలేదు. స్పష్టమైన వైఖరి తెలియజేస్తూ భద్రతా మండలి నుంచి ఒక తీర్మానం వెలువడుతుందని అందరూ ఆశించారు. భద్రతా మండలి సమావేశంలో అధ్యక్షుడి ట్రంప్ ప్రకటనను సమర్థిస్తూ అమెరికా ఐరాస ప్రతినిధి నిక్కీ హేలీ వాదన వినిపించారు. అంతేగాక ఇజ్రాయిల్ పట్ల ఐరాస విద్వేష భావాన్ని కలిగివుందని విమర్శించారు.
జెరూసలేంపై అమెరికా నిర్ణయం మొత్తం మధ్యప్రాచ్యాన్ని ప్రభావితం చేసిందని, దీనివల్ల మళ్లీ ఇక్కడ పెద్ద ఎత్తున హింస చెలరేగవచ్చునని మధ్యప్రాచ్యంలోని ఐరాస ప్రతినిధి నికోలే మాడినోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారంనాటి భద్రతా మండలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. అన్ని పక్షాల్నీ చర్చలకు ఆహ్వానించి ఉద్రిక్తతలను తగ్గించాలని, రెచ్చగొట్టే ధోరణులకు వెళ్లవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయిల్-పాలస్తీనా పౌరులకు జెరూసలేం నగరంతో అనుబంధముందని, ముఖ్యంగా పాలస్తీనా సంస్కృతీ, సాంప్రదాయాలకు జెరూసలేం ముఖ్య కేంద్రమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలు ఈ నగరంతో ముడిపడి ఉన్నాయని మాడినోవ్ తెలియజేశారు. ట్రంప్ నిర్ణయం మధ్యప్రాచ్యంలోని ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రేపిందని ఆయన తెలియజేశారు.
ట్రంప్ నిర్ణయాన్ని ఒక్క ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ తప్ప, అమెరికా మిత్ర దేశాలేవీ సమర్థించటం లేదు. అమెరికా భాగస్వామ్య దేశాలూ ఖండించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, స్వీడన్...తదితర యూరప్ దేశాధినేతలు ట్రంప్ నిర్ణయాన్ని ఖండించారు. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చాలా దేశాలు ఆందోళనగా ఉన్నాయి. ఇంతవరకూ చేపట్టిన శాంతి ప్రక్రియ దెబ్బతిన్నదని, అమెరికా వివాదాస్పద నిర్ణయం
అగ్గి రాజేసిందని ఆఫ్రికా, ఆసియా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







