త్వరలో జీహెచ్‌ఎంసీ స్టీల్‌ టిఫిన్‌ బాక్సులు, జూట్‌ బ్యాగుల విక్రయాలు

- June 20, 2018 , by Maagulf
త్వరలో జీహెచ్‌ఎంసీ స్టీల్‌ టిఫిన్‌ బాక్సులు, జూట్‌ బ్యాగుల విక్రయాలు

ప్లాస్టిక్‌ రహిత హైదరాబాద్‌ దిశగా జీహెచ్‌ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే కార్యాలయాల్లో వినియోగాన్ని నిలిపివేసిన సంస్థ.. నగరంలోనూ ఆ దిశగా మార్పు తీసుకువచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2022 నాటికి హైదరాబాద్‌ను ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ప్రతిజ్ఞ చేశారు. నిషేధం విధించినా.. ప్రజల్లో అవగాహన కోసం ప్రచారం చేసినా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోవడంతో ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్టి సారించారు. చికెన్‌, మటన్‌ దుకాణాలకు టిఫిన్‌ బాక్స్‌ తీసుకెళ్లాలని జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చినప్పటికీ మెజార్టీ పౌరులు దానిని పాటించక పోవడంతో సంస్థ తరపున టిఫిన్‌ బాక్స్‌లు, జూట్‌ బ్యాగులు ఇవ్వాలని నిర్ణయించారు.

జీహెచ్‌ఎంసీ లోగోతో ఉండే టిఫిన్‌ బాక్సులు, జూట్‌ బ్యాగులను సబ్సిడీ ధరకు విక్రయించనున్నారు. ఈ మేరకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్‌లోని మటన్‌, చికెన్‌ దుకాణాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి పైలట్‌ ప్రాజెక్టుగా టిఫిన్‌ బాక్సులు, జూట్‌ బ్యాగులు విక్రయించనున్నారు. ఒక్కో దుకాణం వద్ద 20 నుంచి 30 వరకు ఆయా వస్తువులు అందుబాటులో ఉంచుతారు. ఆధార్‌ కార్డు తీసుకొని ఆయా వస్తువులు ఇవ్వడం ద్వారా ఒకే కుటుంబం రెండు, మూడు తీసుకోకుండా నియంత్రించాలని యోచిస్తున్నారు. దాంతోపాటు టిఫి న్‌ బాక్సులు, జూట్‌ బ్యాగులపై జీహెచ్‌ఎంసీ లోగో ముద్రించడం ద్వారా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

చెత్త డబ్బాల తరహాలో...

సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం గ్రేటర్‌లో దాదాపు 21 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తడి, పొడి చెత్త వేరు చేయాలంటూ కుటుంబాలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలకూ గతంలో జీహెచ్‌ఎంసీ రెండు చెత్త డబ్బాలు ఉచితంగా అందజేసింది. రూ.23 కోట్లతో 44 లక్షల డబ్బాలు పంపిణీ చేశారు. ఆ స్థాయిలో టిఫిన్‌ బాక్సులు, జూట్‌ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయడం కుదరదని భావించిన అధికారులు వాటిని సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించారు. టిఫిన్‌ బాక్స్‌ బహిరంగ మార్కెట్‌లో ధర రూ.50 నుంచి 70వరకు ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.20కే ఇవ్వనున్నారు. జూట్‌ బ్యాగ్‌ రూ.5కు ఇవ్వాలన్నది యోచన. మొత్తంగా ధరలు రూ.5 నుంచి 20లోపు ఉంటాయని ఓ అధికారి చెప్పారు. విక్రయాలకు సంబంధించి చికెన్‌, మటన్‌ దుకాణాల్లో రికార్డు మెయింటెయిన్‌ చేస్తారు. పండ్లు, కూరగాయల మార్కెట్లు, వారం వారం జరిగే సంతల్లో కూండా ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులు జూట్‌ బ్యాగులు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో నిత్యం 70-80 లక్షల కవర్లు వివిధ అవసరాల నిమిత్తం పౌరులు వినియోగిస్తున్నారు. ఇందులో మెజార్టీ 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లే ఉంటున్నాయి.

వీటిని అరికట్టేలా తగిన చర్యలు తీసుకునేందుకు కొన్నాళ్లుగా జీహెచ్‌ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే పలు ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. పైలెట్‌ ప్రాజెక్టు సక్సెస్‌ అయితేనే టిఫిన్‌ బాక్సులు, జూట్‌ బ్యాగుల సబ్సిడీ విక్రయం కొనసాగిస్తామని, దీనికి కూడా సీఎ్‌సఆర్‌లో నిధుల సమీకరణకు యత్నాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజలు కూడా బాధ్యతగా భావించి సహకరిస్తేనే ఏ నిర్ణయమైనా సక్సె్‌సఫుల్‌గా అమలవుతుందని అని కమిషనర్‌ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com