ఢిల్లీ:ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. డెడ్‌బాడీలు ఎలా ఉన్నాయో..

- July 02, 2018 , by Maagulf
ఢిల్లీ:ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. డెడ్‌బాడీలు ఎలా ఉన్నాయో..

 ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో 11 మంది ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. వారంతా మోక్షం చేరేందుకే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కొన్ని కీలక ఆధారాల్ని క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. 2015 నుంచే వీరు చావుకు సిద్ధమై అందుకు సంబంధించిన వివరాలు ఓ రిజిస్టర్‌లో రాస్తున్నట్టు కూడా గుర్తించారు. ఈ  భాటియా పరివార్ సామూహిక ఆత్మహత్యల్లో  మరో ట్విస్ట్ ఏంటంటే, ఇంట్లో డెడ్‌బాడీలు ఎలా ఉన్నాయో అదే తరహాలో బయట గోటకు కొన్ని పైపులు అమర్చి ఉండడం. ఈ మిస్టరీ ఏంటన్న దానిపైనా దర్యాప్తు జరుగుతోంది.


ఒకే కుటుంబంలో 11 మంది సూసైడ్ చేసుకున్నారు.. వృద్ధులు.. పిల్లలు.. అంతా కలిసి ప్రాణాలు తీసుకున్నారు. ఈ 11 మంది మోక్షం కోసమే ఇలా చేశారా...? ప్రాధమికంగా దొరికిన ఆధారాలను బట్టి చూస్తే వీళ్లంతా మూఢ భక్తితోనే ఇలా చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సంత్ నగర్‌లో జరిగిన ఈ సామూహిక ఆత్మహత్యలు ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముందు మర్డర్స్‌గా భావించి కేసు దర్యాప్తు మొదలుపెట్టినా.. ఇంట్లో కొన్ని పూజలు చేసినట్టు ఆనవాళ్లు ఉండడం.. ఆత్మహత్యలపై కొన్ని లెటర్లు దొరకడంతో కొత్త కోణం వెలుగు చూసింది. 2015 నుంచి వీరు రాస్తున్న 2 రిజిస్టర్లు పోలీసులు గుర్తించారు. అలాగే.. జూన్ 30న అందరూ దేవుడి దగ్గరకు వెళ్తున్నట్టు వీళ్లు రాసిపెట్టిన ఓ లెటర్ కూడా దొరికింది. దీన్ని బట్టి చూస్తే.. మూఢ భక్తితో, మోక్షం సిద్ధిస్తుందన్న నమ్మకంతో ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.

ఇంట్లో పెద్దావిడ మృతదేహం నేలపై ఉండగా.. మిగిలిన 10 మంది ఉరి వేసుకున్నారు. అందరి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. చేతులు వెనక్కి కట్టేసి, నోట్లో, చెవుల్లో గుడ్డలు పెట్టి ఉన్నాయి. దీనికి మతపరమైన విశ్వాసాలే కారణంగా చెప్తున్నారు. కొందరు గురువులు చెప్పిన మాటలు విని వీళ్లు మోక్షం కోసం సూసైడ్ చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. మానవదేహం తాత్కాలికం, కళ్లు నోరు, చెవులు మూసుకోవడం ద్వారా భయాన్ని జయించవచ్చు,  11 మంది కలిసి ఈ సంప్రదాయాలను పాటిస్తే మోక్షం లభిస్తుంది.. అంటూ ఉన్న రెండు పేపర్లను ఆ ఇంట్లో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్లు తిన్న ఆహారంలో మత్తు పదార్థాలు కలుపుకున్నట్టు తేలింది. 

 ఈ కేసును విచారిస్తున్న పోలీసులు మరో ఆసక్తికర అంశాన్ని గుర్తించారు. అదే ఇంటి బయటి గోడకు 11 పైప్‌లు ఫిట్ చేసి ఉండడం. ఆ 11 పైప్‌లకు ఈ 11 మందికి ఏమైనా లింకు ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో డెడ్‌బాడీలు ఎలా అయితే ఉన్నాయో బయట కూడా పైపులు అలాగే బిగించారు. ఒకటి ఒక చోట.. రెండు ఒక చోట.. 8 ఒక చోట అన్నట్టుగా వీటిని గోడలో ప్లాస్టింగ్ చేశారు. ఉన్న పైపుల్లో 4 పెద్దవిగా ఉన్నాయి. అవి తిన్నగా ఉన్నాయి. అవి మగవారివిగా విశ్లేషిస్తున్నారు. మిగతావి బెండు పైపులు. వీటిని మహిళలు, పిల్లలకు గుర్తుగా చెప్తున్నారు. వీటి  సైజుల్లో తేడాలున్నాయి. అలాగే విడిగా ఉన్న పైప్.. వృద్ధ మహిళకు చెందిన గుర్తుగా భావిస్తున్నారు. సూసైడ్ తర్వాత ఆత్మలు పైలోకం చేరడానికి వీటిని పెట్టారా అన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ పైపులు.. తాంత్రికపూజలు.. ఆత్మల వార్తలతో.. చుట్టుపక్కల వాళ్లు వణికిపోతున్నారు. అసలు.. గోడకు వీటిని ఎప్పుడు ఫిట్ చేశారో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ముందు వీటిని చూసినప్పుడు తమకు ఎలాంటి అనుమానం రాలేదని.. తీరా ఇప్పుడు ఆత్మలు, మోక్షం వార్తలతో భయం వేస్తోందని అంటున్నారు. 

 అటు పోస్ట్‌మార్టం ప్రాథమిక రిపోర్ట్‌లో  వీరంతా ఉరి వేసుకోవడం వల్లే మృతి చెందినట్లు తెలిసింది. కుటుంబంలోని ముగ్గురు సభ్యులు.. మిగిలిన 8 మందినీ ఉరివేసి.. తర్వాత వారు ఆత్మహత్య చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. వృద్ధురాలు నిలబడలేదు కాబట్టి ఆమెను చంపి నేలపైనే పడుకోబెట్టినట్లు తెలుస్తోంది. సూసైడ్ చేసుకున్న భాటియా పరివార్‌కు స్థానికంగా మంచి పేరుంది. వీళ్లకు దైవ భక్తి ఎక్కువ. రోజూ సాయంత్రం పూజ చేస్తారని స్థానికులు చెప్తున్నారు. ఐతే.. ఇప్పుడిలా బలవన్మరణానికి పాల్పడడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. 

 ఆదివారం ఉదయం ఏడుంపావుకు వీరు చనిపోయినట్టుగా పక్కింటి వాళ్లు గుర్తించారు. స్థానికంగా జనరల్ స్టోర్ నడుపుతున్న భాటియా బ్రదర్స్.. రోజూ ఐదున్నర కల్లా షాప్ తెరుస్తారు. కానీ, ఏడు గంటలయినా దుకాణానికి రాకపోయేసరికి పాల కోసం వచ్చిన కస్టమర్లు క్యూలో ఉన్నారు. ఏమైందో కనుక్కుందామని ఇంటికి వెళ్లిన వాళ్లు అక్కడి దృశ్యం చూసి షాక్  అయ్యారు. మెయిన్‌ డోర్ తీసే ఉండడం.. అంతా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు వీటిని మర్డర్లుగా భావించి దర్యాప్తు చేసినా.. ఇంట్లో బంగారం, డబ్బులు, మొబైల్స్ లాంటివి ఏవీ మిస్ అవకుండా ఉండడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు. ఇంట్లో దొరికిన లేఖల్ని బట్టి ఇది మోక్షం కోసం జరిగిన సూసైడ్‌లుగా భావిస్తున్నారు. అలాగే.. ఇంట్లో స్వాధీనం చేసుకున్న రిజిస్టర్లలో కీలకమైన సమాచారం కూడా పోలీసులు గుర్తించారు. శనివారం.. ఆదివారం.. గురువారం.. రోజుల్లో సూసైడ్ చేసుకోవాలని వాళ్లు అందులో రాసుకున్నారు. దీన్ని బలపరిచేలా మరికొన్ని ఆధారాలు కూడా దొరికాయి. వీటన్నింటినీ సీజ్ చేసి PSకు తీసుకెళ్లారు. అటు, డెడ్‌బాడీలకు పోస్ట్‌మార్టం పూర్తవడంతో బంధువులకు అప్పగించారు. ఢిల్లీలోని శ్మశానవాటికలో అంతిమసంస్కారాలు పూర్తి చేశాక.. వీరి బంధువుల్ని కూడా విచారించనున్నారు పోలీసులు. ఈ కేసు మిస్టరీ అంతా మోక్షం, దేవుడు, ఆత్మల చుట్టే తిరుగుతున్నందున ఇంకెలాంటి ఆసక్తికర విషయాలు బయటపడాయోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com