సౌదీ రోడ్ల పై హవా చాటిన సారమ్మ థామస్

- July 04, 2018 , by Maagulf
సౌదీ రోడ్ల పై హవా చాటిన సారమ్మ థామస్

సౌదీ అరేబియా:కాలం మారింది... మారుతూనే ఉంటుంది. రోడ్లు ఒకప్పటివే, కార్లూ అప్పటివే... కానీ డ్రైవర్లు మారారు. సౌదీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్త్రీలు కార్లు నడపరాదనే నిబంధనను చెరిపేస్తూ ఈ మధ్యనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. ఒకప్పుడు కార్లు నడపాలనే కోరిక ఉన్న సౌదీ మహిళలు వీడియో గేముల్లో కారు డ్రైవింగ్‌ చేస్తూ సంతృప్తి పడేవారు. ఇంకెన్నాళ్లు..? కాలం మారుతూనే ఉందిగా! జూన్‌ 24వ తారీఖున రరు..రరు... అంటూ పురుషులతో సమానంగా సౌదీ స్త్రీలూ కారు స్టీరింగ్‌ని తిప్పారు. తర్వాత రెండురోజుల్లో స్త్రీలకు ప్రత్యేకమైన కార్‌ పార్కింగ్‌ కేటాయిస్తూ అక్కడి అధికారం తీసుకున్న నిర్ణయంతో మరో చరిత్ర నెలకొంది. సౌదీలో డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకుంటున్న మహిళామణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో మరో సంఘటన భారతీయుల్ని సంతోషానికి గురిచేసింది. దీనికి కారణం సోమీ జిజి... సౌదీ అరేబియాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన మొదటి భారతీయ మహిళ ఈమె. 
సోమీ సౌదీకి వెళ్లి పదేళ్లవుతుంది. ఇండియాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న ఆమె సౌదీ వీధుల్లో మాత్రం డ్రైవింగ్‌ సీట్లో కూర్చోలేకపోయింది. కేరళాలోని పఠానమ్‌తిట్ట కుంభజకు చెందిన సారమ్మ థామస్‌ ఆకా, అలియాస్‌ సోమి జిజి తన భర్త మాథ్యూ, కుమారుడు ఐదన్‌తో కలిసి ఇప్పుడు సౌదీలోని రియాద్‌ వీధుల్లో స్వేచ్ఛగా కారు నడుపుతోంది. కింగ్‌ అబ్ధులజీజ్‌ నావల్‌ బేస్‌ మిలటరీ హాస్పిటల్‌ల్లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న సోమి జిజి ఇన్నేళ్లకు తాను సౌదీలో కారు నడుపుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. 'అసలు కాకపోవడం కన్నా కాస్త ఆలస్యమవడం ఫర్వాలేదులే' అంటోంది సోమి జిజి చేత్తో స్టీరింగ్‌ తిప్పుతూ నవ్వు ముఖంతో. సౌదీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడిన తర్వాత సోమి భర్త మాథ్యూ ఆమెని 'నువ్వు లైసెన్స్‌కి దరఖాస్తు చేసుకో' అన్నప్పుడు తన డ్రైవింగ్‌పై భర్తకున్న నమ్మకానికి సంతోషించింది సోమి. డ్రైవింగ్‌ పరీక్షలో నెగ్గింది. భారతదేశంలో జరిగే డ్రైవింగ్‌ టెస్ట్‌కీ, సౌదీలో టెస్ట్‌కీ తేడా లేకపోలేదు. అక్కడ ప్రక్రియ కాస్త కఠినంగానే ఉంటుంది. అందులో భాగంగా సమాంతరంగా కారుని పార్క్‌ చేయడంలోనూ సోమీ నెగ్గింది. టయోటా యారిస్‌లో తాను పనిచేస్తున్న హాస్పిటల్‌కు వెళుతున్న సోమి జిజి 'ఇండియాలో కారు నడపడం కంటే సౌదీలో నడపడమే సులువు' అంటోంది. ఎందుకంటే అక్కడ ప్రజలు చట్టానికి లోబడి ఉండటం. అంతేకాకుండా అక్కడ రోడ్లలో ఎక్కువ శాతం ఒన్‌వే రోడ్లే కావడం. ప్రస్తుతం కార్‌ డ్రైవింగ్‌ సీట్లో కూర్చొని, స్టీరింగ్‌ పట్టుకుంటుంటే సోమీకి ఆత్మవిశ్వాసం మరింత బలపడిందని అంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com