పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దు:మోదీ

పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దు:మోదీ

ఢిల్లీ: ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ప్రధాని మోడి ఈరోజు పరీక్ష పే చర్చా కార్యక్రమం ద్వారా రెండోసారి విద్యార్థులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో పరీక్షలు, తదితర అంశాలపై మాట్లాడారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని, పరీక్షలే జీవితం కాదని మోడి విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలు నెరవేర్చాలని అనుకోవద్దని తెలిపారు.అనుకోవడంతో చిన్నారులపై భారం పెరుగుతుందని, అలా చేయకూడదని చెప్పారు. పిల్లలు విఫలమైనప్పుడు కూడా తల్లిదండ్రులు చిన్నారుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని తెలిపారు. తల్లిదండ్రులు దగ్గరుండి సాంకేతికత సాయంతో కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా క్షమార్హం.. కానీ మీ లక్ష్యం చిన్నదైతే మాత్రం అది క్షమార్హం కాదని మోడి వెల్లడించారు. మీరు రోజుకు 17 గంటలు పనిచేయడానికి ఏం అంశం మిమ్మల్ని ప్రోత్సహిస్తోందని ఓ విద్యార్థిని మోదీని ప్రశ్నించగా.. ఓ తల్లి కుటుంబం కోసం 24 గంటలు శ్రమించినట్లుగానే, నేను నా 1.25కోట్ల భారతీయ కుటుంబం కోసం శ్రమిస్తున్నానని సమాధానమిచ్చారు. రోజులోని 24 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలని మోదీ విద్యార్థులకు సూచించారు.

సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఎంబీఏలు అవసరం లేదని అన్నారు. గత ఏడాది కేవలం ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లోని విద్యార్థులే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు రష్యా, నేపాల్‌, నైజీరియా, ఇరాన్‌, దోహా, కువైట్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌లలో చదువుతున్న పలువురు భారతీయ విద్యార్థులు కూడా వచ్చారు.

Back to Top