మహిళల కోసం 'అమెజాన్‌ సహేలి'

- March 04, 2019 , by Maagulf
మహిళల కోసం 'అమెజాన్‌ సహేలి'

కొచ్చిన్‌: కేరళ ప్రభుత్వం అమలుచేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమం, మహిళా సాధికారతకు నిర్దేశించిన కుడుంబశ్రీ విభాగంతో అమెజాన్‌ ఇండియా ఒప్పందంచేసుకుంది. కేరళ ప్రభుత్వంతో కలిసి అమెజాన్‌ సహేలి పథకాన్ని నిర్వహిస్తున్నది. ఈ పథకం భాగస్వామ్యం కింద అమెజాన్‌ ఇండియా శిక్షణ, మద్దతునిచ్చి మహిళా పారిశ్రామికవేత్తల సాధికారతకు తోడ్పడుతుంది. అంతేకాకుండా వారి ఉత్పత్తులను అమెజాన్‌ కస్టమర్లకు చేరువచేస్తుందని వెల్లడించింది. కుడుంబశ్రీ అనేపథకం ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత పథకాల్లో ఒకటిగా నిలిచింది. సుమారు వెయ్యికిపైగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీలతో సుమారు పదిలక్షల మంది మహిళలకు కేరళలోని 14 జిల్లాల్లో ఆర్ధికమద్దతును, స్వావలంబనను చేకూరుస్తోంది. సహేలి టీమ్‌ ఈమహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. ఎలాంటి ఖర్చులేకుండా ఆన్‌లైన్‌లోనే వారి ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే వారికి నిరంతరాయంగా ఆన్‌లైన్‌ విక్రయాల్లో సాయం అందిస్తుంది. వారి ఉత్పత్తుల చిత్రాలు, కేటాలాగ్‌, ఉత్పత్తుల జాబితాచేయడం, రిఫరల్‌ఫీజుల్లో సబ్సిడీ, ఉచిత ఖాతా నిర్వహణ వంటి వాటిలో సాయం అందిస్తోంది.

కిరాణా, గృహ, ఫ్యాషన్‌ రంగాలకు సంబంధించి ప్రత్యేకించి మహిళలే తయారుచేసిన ఉత్పత్తులకు అమెజాన్‌ తన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో భాగస్వామ్యం కల్పిస్తున్నది. అమెజాన్‌ ఇప్పటికే ఒక కార్యగోష్టిని నిర్వహించి వారి ఉత్పత్తులను జతచేసింది. కిరాణా, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు అమెజాన్‌ మంచి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ పైలట్‌ స్కీంకింద మొదటి మూడువారాల్లోను హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలనుంచి ఆర్డర్లు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com