మోదీకి ప్రపంచ దేశాధినేతల శుభాకాంక్షలు, 30న ప్రధానిగా ప్రమాణ స్వీకారం!
- May 24, 2019
భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ తంతు కంటే ముందు ఆయన ఈనెల 28న వారణాసిలో పర్యటిస్తారు. అక్కడ ఆయన భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 28న వారణాసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. 29న సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్కడ తన తల్లి హీరాబెన్ వద్ద ఆశీర్వాదం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
గురువారం వెల్లడైన లోక్ సభ ఫలితాల్లో ప్రధాని మోదీ సారథ్యంలోని భాజపా 303 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్డీయే పక్షాలతో కలిసి 352 సీట్లు గెలుచుకుంది. దీంతో తిరిగి రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని కానున్నారు. ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా భాజపా సీనియర్‌నేతలైన మురళీ మనోహర్ జోషీ, ఎల్.కె. ఆడ్వాణీలతో మోదీ, అమిత్ షా భేటీ అయ్యారు. భాజపా విజయాన్ని వారితో పంచుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు దూసుకెళుతోంది. దాదాపు విజయం ఖాయమైన వేళ ప్రపంచ దేశాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగుదేశాలైన శ్రీలంక, చైనా, భూటాన్, నేపాల్‌తో పాటు రష్యా, ఇజ్రాయెల్, ఆఫ్గానిస్థాన్ దేశాధినేతలు ట్విటర్ ద్వారా మోదీకి అభినందనలు తెలిపారు. ‘‘అద్భుతమైన విజయాన్ని సాధించిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. రానున్న కాలంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మోదీకి అభినందనలు తెలియజేస్తూనే.. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించారు. హిందీతో పాటు హీబ్రూలోనూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.
అలాగే అఫ్గానిస్థాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ స్పందిస్తూ.. ‘‘భారత ప్రజల మద్దతుతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న మోదీకి శుభాకాంక్షలు. శాంతి పరిరక్షణ, దక్షిణాసియాలో ప్రజల సంక్షేమం కోసం మీతో కలిసి నడిచేందుకు అఫ్గాన్ సిద్ధంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. వీరితో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జింగ్‌పింగ్ మోదీకి ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశారు. అలాగే నేపాల్, భూటాన్ దేశాధినేతలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా.. మోదీకి అభినందనలను తెలియజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







