తెలంగాణా కొత్త జడ్పీ చైర్మన్లు వీరే..!

- June 06, 2019 , by Maagulf
తెలంగాణా కొత్త జడ్పీ చైర్మన్లు వీరే..!

ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయఢంఖా మోగించిన టీఆర్ఎస్,ఇక ఈ నెల 8న ఎన్నుకోనున్న జడ్పీ చైర్మన్ల నియామకంపై దృష్టి పెట్టింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా జడ్పీ చైర్మన్లు ఎవరనేది ముందుగానే ప్రకటించినప్పటికీ, ఫలితాల్లో గెలుపోటములను పరిగణలోకి తీసుకుని అధికారికంగా 8వ తేదీన ప్రకటించనున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులను కూడా అదే రోజున ఎన్నుకోనున్నారు

అనధికారికంగా ఖరారైనప్పటికీ..అధికారికంగా ప్రకటించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 32 జిల్లాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ప్రభంజనం సృష్టించినందున..గులాబీ నేతలే అన్ని జిల్లాల్లో జడ్పీ చైర్మన్లుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే..ఇప్పటివరకు అనధికారికంగా టీఆర్ఎస్ పార్టీ 25 జిల్లాలకు జడ్పీ చైర్మన్లను ఖరారు చేసింది. ఆ జాబితా ప్రకారం.

వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్​గా గండ్ర జ్యోతి పేరు దాదాపుగా ఖరారైంది. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతి ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ములుగు జిల్లా జడ్పీ పీఠం కుసుమ జగదీష్​కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లా ఛైర్మన్​గా సంపత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వ్ అయిన వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్​కు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సన్నిహితుడు మారెపల్లి సుధీర్ కుమార్ ఛైర్మన్ కానున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్​గా జక్కు శ్రీహర్షిణి అయ్యే అవకాశముంది. మహబూబాబాద్ జిల్లా పరిషత్​పై కసరత్తు కొనసాగుతోంది.

కుమురం భీం ఆసిఫాబాద్​ జడ్పీ ఛైర్​ పర్సన్​గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును స్వయంగా కేసీఆరే. తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. నిర్మల్​ జిల్లాకు డీసీసీబీ మాజీ ఛైర్మన్​ రామకృష్ణారెడ్డి భార్య కె.విజయలక్ష్మి పేరును దాదాపుగా ఖరారు చేశారు. మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్​గా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల భాగ్యలక్ష్మీకి ఇవ్వాలని గులాబీ అధిష్ఠానం నిర్ణయించింది.

పెద్దపల్లి జిల్లా పరిషత్​ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేరును కేసీఆర్​ ఖరారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు జి. మంజుల రెడ్డి, జగిత్యాల జడ్పీ స్థానానికి దరిశెట్టి లావణ్యకు అవకాశం ఇచ్చారు. కరీంనగర్​ ఛైర్​ పర్సన్​ స్థానం కోసం కనుమల్ల విజయ, మాచర్ల సౌజన్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

నల్గొండ జిల్లా పరిషత్ స్థానానికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఎన్నిక దాదాపు ఖాయమైంది. యాదాద్రి భువనగిరి జడ్పీ పీఠం మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డికి దక్కనుంది. సూర్యాపేట జడ్పీ స్థానాన్ని గుజ్జ దీపికకు ఖరారు చేశారు.

మహబూబ్​నగర్ జడ్పీ ఛైర్ పర్సన్​గా మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా పరిషత్​ను ఎంపీ పి.రాములు కుమారుడు పి.భరత్​ ప్రసాద్​కు ఇవ్వనున్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి సన్నిహితుడు లోక్​నాథ్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాకు సరితను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నారాయణ పేట జడ్పీ స్థానాన్ని అంజనమ్మ, అశోక్ గౌడ్, అంజలి ఆశిస్తున్నారు.

ఖమ్మం జడ్పీ ఛైర్ పర్సన్​గా లింగాల కనకరాజు పేరు ఖరారైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎన్నిక దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.

నిజామాబాద్ జడ్పీ పీఠం కోసం విఠల్ రావు, జగన్, సుమనారెడ్డి పోటీ పడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఛైర్ పర్సన్​గా దఫేదార్ శోభను అధిష్ఠానం ఎంపిక చేసింది.

మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్​గా హేమలత గౌడ్, సిద్దిపేట జిల్లా పరిషత్​కు వేలేటి రోజా పేర్లు ఖరారు చేశారు. సంగారెడ్డి జడ్పీ కోసం మంజుశ్రీ, సుప్రజ పోటీ పడుతున్నారు.

రంగారెడ్డి జడ్పీ ఛైర్ పర్సన్​గా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితకు అవకాశం ఇవ్వాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్​గా రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎన్నిక కానున్నారు. మేడ్చల్ జడ్పీ ఛైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడు శరత్ చంద్రారెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. రెండు రోజుల్లో జడ్పీ ఛైర్​ పర్సన్లు, వైస్​ ఛైర్​ పర్సన్ల పేర్లను తెరాస అధికారికంగా ప్రకటించనుంది. పార్టీ ఇన్​ఛార్జీలు ఆయా జిల్లాల్లోనే ఉండాలని కేటీఆర్​ నిర్ధేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com