కథువా చిన్నారి రేప్, మర్డర్ కేసులో కోర్టు తీర్పు

- June 10, 2019 , by Maagulf
కథువా చిన్నారి రేప్, మర్డర్ కేసులో కోర్టు తీర్పు

భారత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూకాశ్మీర్ కథువా బాలిక రేప్ కేసులో పటాన్ కోట్ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. ఒకరిని నిర్దోషిగా ప్రకటించింది. 2018 జనవరిలో 8ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో 16 నెలల తర్వాత తీర్పు వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దోషుల్లో మాజీ ప్రభుత్వ ఉద్యోగి సాంజీ రామ్ ఉన్నాడు. ఈ దారుణం వెనుక మాస్టర్ మైండ్ అతడే అని పోలీసులు భావిస్తున్నారు. దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2గంటలకు కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది.

8ఏళ్ల ముస్లిం బాలికను.. కిడ్నాప్ చేసి కథువా సమీపంలోని గ్రామ ఆలయంలో నిర్బంధించారు. బాలికను చిత్రహింసలు పెట్టారు. డ్రగ్స్ ఇచ్చారు. తిండి పెట్టకుండా వేధించారు. రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు. చివరికి రాయితో తలమీద కొట్టి ఆ పాపను చంపేశారు. బాలికను దేవాలయంలో బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడి 22ఏళ్ల కొడుకు కూడా నిందితుడే అంటున్నారు. జూన్ 3తో ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయ్యింది. దీంతో సోమవారం (జూన్ 10,2019) న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. నిందితులకు ఉరి శిక్ష విధించాలని బాధిత కుటుంబంతో పాటు యావత్ భారత దేశం కోరుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com