ప్రముఖ రచయిత్రి "అబ్బూరి ఛాయాదేవి" ఇక లేరు

- June 28, 2019 , by Maagulf
ప్రముఖ రచయిత్రి

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (83) కన్నుమూశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో ఉంటున్న ఛాయాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

13 అక్టోబరు 1933లో రాజమహేంద్రవరంలో జన్మించిన ఛాయాదేవి నిజాం కళాశాల నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. 1953లో కాలేజీ మ్యాగజైన్‌లో 'అనుభూతి' పేరుతో తొలి కథ రాశారు. మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలను కథా వస్తువుగా చేసుకుని పలు కథలు రాశారు. ఆమె రాసిన కథల్లో కొన్ని హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువదించబడ్డాయి.
వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.

1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com