జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ కి ఝలక్ ఇచ్చిన హైకోర్టు
- July 10, 2019
దేశం విడిచి వెళ్లాలనుకున్న జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లడానికి అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సురేష్ కైత్ తీర్పునిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని, ఒకవేళ దేశం విడి వెళ్లాలంటే రూ.18వేల కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాలని ఆదేశించారు. మే 25న గోయల్ దుబాయ్‌కు వెళుతుండగా విమానం నుంచి దింపివేశారు. దాంతో తనపై జారీ చేసిన లుకవుట్ సర్కులర్ ని సవాల్ చేస్తూ గోయల్ హైకోర్టుని ఆశ్రయించారు. జెట్ ఎయిర్ వేస్ రుణదాతలకు గోయల్ రూ.18వేల కోట్లు బకాయి పడ్డారు. ''ఈ సమయంలో గోయల్‌కు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించేది లేదు. మీరు రూ.18వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధపడితే, విదేశానికి వెళ్లొచ్చు'' అని హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ అన్నారు. తమ స్పందన తెలియజేయాలని హోం, కార్పొరేట్, న్యాయ శాఖలను ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు ఆగస్ట్ 23కు వాయిదా వేసింది.
మే 25న దుబాయికి వెళ్లే విమానం నుంచి గోయల్, ఆయన భార్య అనిత్‌ను ఎయిర్ పోర్టులో దించేశారు. తనపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినా, లుకవుట్ సర్క్యులర్ పేరిట ఈ విధమైన చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ గోయల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. విమానం నుంచి దింపివేసిన తర్వాతే తన మీద జారీ అయిన లుకవుట్ సర్కులర్ గురించి తెలిసిందని గోయల్ వెల్లడించారు. విదేశీ పెట్టుబడిదారులతో జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు మాట్లాడాల్సి ఉందని, జెట్ గ్రూపు కోసం నిధులు సమకూర్చుకునేందుకు దుబాయ్, లండన్ వెళ్లాలనుకున్నట్టు నరేశ్ గోయల్ తరపు లాయర్ వాదించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఫోన్ లేదా ఇతర మార్గాల్లో విదేశీ ఇన్వెస్టర్లతో మాట్లాడొచ్చని కోర్టు తెలిపింది.
గోయల్‌కు బ్రిటన్ నివాస వీసా, యూఏఈ నివాస పర్మిట్ ఉన్నాయని, ఇవి జూలై 10, 23వ తేదీల్లో రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నందున వెంటనే బ్రిటన్, యూఏఈ వెళ్లాల్సి ఉందని గోయల్ తరుఫు లాయర్ చెప్పారు. నరేష్ గోయల్ అభ్యర్థనకు వ్యతిరేకంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ ఆచార్య వాదనలు వినిపిస్తూ... ఇది తీవ్రమైన రూ.18వేల కోట్ల మోసమని, ఎస్‌ఎఫ్‌ఐవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విచారణలో గోయల్ పాల్గొని తన స్పందనను తెలియజేయాల్సి ఉందన్నారు.
జెట్ ఎయిర్ వేస్‌లో అవకతవకలు జరిగినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తనిఖీల్లో తేలడంతో... నరేశ్ గోయల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్‌లో తీవ్ర నిధుల కొరత కారణంగా జెట్ ఎయిర్ వేస్ తన కార్యకలాపాలను ఆపేసింది. మార్చిలోనే నరేశ్ గోయల్‌తో పాటు ఆయన భార్య అనిత గోయల్ జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి తప్పుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..