కేరళకు హై అలెర్ట్!

కేరళకు హై అలెర్ట్!

కేరళ: కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా కాసర్‌గాడ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు బలపడుతున్నాయని చెప్పిన వాతావరణశాఖ.. ఇడుక్కి, కన్నూర్, కోజికోడ్, మల్లాపురం, వాయనాడ్ ప్రాంతాల్లో ఆరంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
 
రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
జూలై 19 నుంచి 22 వరకు వాయనాడ్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది కేంద్రవాతావరణశాఖ. ఆ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల మేరా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మల్లాపురం, కన్నూర్‌ జిల్లాల్లో జూలై 19 వరకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వెదర్ డిపార్ట్‌మెంట్ కాసర్‌గడ్‌కు జూలై 20 వరకు ప్రకటించింది.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న అధికారులు
రెడ్ అలర్ట్ వాతావరణశాఖ జారీ చేసిందంటే... ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని అర్థం. అంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి పాటించాలని వాతావరణశాఖ చెబుతోంది. ఇదిలా ఉంటే తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలపుజా, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కడ్ జిల్లాలకు పసుపుపచ్చ రంగు (యెల్లో ) అలర్ట్ జారీ చేసింది. ఇక నదుల్లో నీటిస్థాయి పెరగడం, డ్యామ్‌లు నిండిపోతుండటంతో ఇడుక్కి ఎర్నాకులంలోని డ్యామ్‌గేట్లను అధికారులు ఎత్తివేశారు. నదీ తీరంలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
 
కోజికోడ్, ఇడుక్కి ప్రాంతాల్లో 14 సెం.మీ వర్షపాతం
ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. ఇక కేరళ లక్షద్వీప్‌లలోని మత్స్యకారులకు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక సుముద్రంలో వాయువ్యదిశగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన కోజికోడ్ , ఇడుక్కి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది వాతావరణ శాఖ. మల్లాపురం, త్రిసూర్, ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఐదురోజుల పాటు ప్రత్యేక పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరిచిన అధికారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూజా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది.

Back to Top