కశ్మీర్‌లో టెన్షన్‌లోనూ బాధ్యతలు వీడని క్రికెటర్‌

- August 04, 2019 , by Maagulf
కశ్మీర్‌లో టెన్షన్‌లోనూ బాధ్యతలు వీడని క్రికెటర్‌

ధోనీ.. భారత క్రికెట్‌ జట్టులో 100 శాతం అంకిత భావంతో ఆడే ఆటగాడిగా పేరుంది. ఆయన ఈ అంకిత భావాన్ని భారత జట్టు కోసమే కాదు.. దేశం విషయంలో కూడా చూపుతున్నారు. ఒక పక్క కశ్మీర్‌లో అత్యంత ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థతి నెలకొంది. ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370లలో మార్పులు చేయవచ్చనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో లోయ మొత్తం నివురు గప్పిన నిప్పులా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత భద్రత మధ్య కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులను ఇక్కడకు రావద్దని హెచ్చరికలు ఉన్నాయి. వారు కూడా అక్కడికి వెళ్లేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అటువంటిది మహేంద్రుడు మాత్రం నిస్సంకోచంగా విధుల్లో చేరారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా తన ర్యాంక్‌ అధికారులు నిర్వహించే విధులనే ఆయన కూడా నిర్వహిస్తున్నారు.

ధోనీ అక్కడేం చేస్తున్నారు.. 
ధోనీ టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌గా చేరిన విషయం తెలిసిందే. ఆయన గురువారం నుంచి తన రెగ్యూలర్‌ విధులను చేపట్టారు. వాస్తవానికి ఆయనకు గౌరవ లెఫ్టినెంట్‌ హోదాను సైన్యం కల్పించింది. ఈ హోదాలో ఉంటే వారికి రెగ్యూలర్‌ విధులు అప్పగించరు. కానీ, ధోని కొన్ని నెలల క్రితం సైన్యానికి లేఖ రాస్తూ.. తనకు సాధారణ విధులు కూడా అప్పగించాలని కోరారు. దీంతో ఈసారి ఆయనకు అత్యంత సమస్యాత్మకమైన శ్రీనగర్‌లో గస్తీ విధులను అప్పగించారు. ఈ క్రమంలో ఆయన సాధారణ జవాన్లకు కేటాయించే బ్యారాక్‌ల్లోనే ఉంటున్నారు. వాస్తవానికి ధోనికి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఉంది. దీంతో ఆయనకు ప్రత్యేక గది కేటాయిస్తారు. కానీ, ధోనీ ఆ ఏర్పాట్లను నిరాకరిస్తూ సైన్యానికి లేఖ రాశారు. తన కోసం ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లను కోరలేదు. అందరి వలే ఉదయం 5 గంటలకు నిద్రలేచి దినచర్యను ప్రారంభిస్తున్నారు. సాధారణ జవాన్లతోపాటే కలిసి భోజనం చేస్తున్నారు.

గ్రామాల్లో పెట్రోలింగ్‌..?
ప్రస్తుతం 106 టీఏ పార బెటాలియన్‌లో ఆగస్టు 15 వరకు ధోనీ విధులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన సమీప గ్రామాల్లో కూడా పెట్రోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. కశ్మీర్‌ లోయలోని గ్రామాలు ఉగ్రవాదులకు అడ్డాలని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత దట్టమైన అడవుల మధ్య ఉండే అందమైన గ్రామాల్లో ఉగ్రవాదులు తోడేళ్ల వలే నక్కి ఉంటారు. భారీ కాన్వాయ్‌లో వెళుతున్న సీఆర్పీఎఫ్‌ దళాలపై దాడిచేసిన చరిత్ర ఇక్కడి ఉగ్రవాదులకు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పెట్రోలింగ్‌ ఎంత ప్రమాదకరమో అంచనా వేసుకోవచ్చు. సైన్యానికి చెందిన రెండు స్పెషల్‌ ఫోర్సు బెటాలియన్లు కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. ఇవి వాస్తవాధీనన రేఖను కాపాడటం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పాల్గొనడం వీటి విధి. ఈ క్రమంలోనే ధోనీ సాధారణ గార్డ్‌ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది.

వాస్తవానికి ధోనీ చేస్తోంది ఏమిటీ.. 
ధోనీ ఏదో పూర్తిస్థాయిలో కమాండో వలే పోరాడతారని మనం ఆశించలేము. కానీ, సైన్యానికి ధోనీ నిరుపమాన సేవలు అందిస్తున్నారని కచ్చితంగా చెప్పవచ్చు. అది ఎలాగంటే.. ధోనీని భారత్‌ మొత్తం.. ముఖ్యంగా యువత ఎంతగా ఆరాధిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యక్తి సైన్యం కోసం ప్రాణాలను రిస్కులో పెట్టుకొని మరీ సాధారణ విధుల్లో చేరడం అనేది సరిహద్దుల్లో పనిచేసే బలగాలల్లో కచ్చితంగా నైతిక స్థైర్యం నింపుతుంది. మనం ఏ దేశ ప్రజల కోసం పోరాడుతున్నామో.. ఆ దేశ ప్రజలు ఆరాధించే వ్యక్తే వచ్చి మన వెనకే ఉన్నారన్న ధైర్యం వారికి లభిస్తుంది. రేపు బతుకుతామో లేదో తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వహించే వారికి మనోధైర్యానికి మించిన కిక్కు మరేమిస్తుంది.. ఇప్పుడు మహేంద్రుడు ఆ కిక్కునే ఇస్తున్నాడు. హేట్సాఫ్‌ ధోనీ..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com