రేపు ఉదయం కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కశ్మీర్‌పై కీలక నిర్ణయం!

- August 04, 2019 , by Maagulf
రేపు ఉదయం కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కశ్మీర్‌పై కీలక నిర్ణయం!

జమ్మూకాశ్మీర్‌పై వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం. హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ అధికారులు హాజరయ్యారు. కశ్మీర్‌ పరిణామాలపై అధికారులతో చర్చిస్తున్నారు హోంమంత్రి అమిత్‌ షా. కాశ్మీర్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

మరోవైపు రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఇందులో కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కేంద్రం దూకుడుతో కశ్మీరీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదో జరుగుతందని భావిస్తున్న స్థానికులు ముందు జాగ్రత్తగా నిత్యావసర సరుకులను సమకూర్చుకుంటున్నారు. నెలకు సరిపడా వస్తువులు కొని తెచ్చుకుంటున్నారు. పెట్రోల్‌ బంకులకు క్యూ కట్టారు. ఏటీఎం సెంటర్లకు బారులు తీరారు. మరోవైపు తాజా పరిణామాలతో పర్యాటకులు వెనక్కి తిరిగి వెళ్తున్నారు. అటు జర్మనీ, బ్రిటన్‌ దేశాలు కూడా తమ పౌరులను హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్‌కు వెళ్తొందని తమ పౌరులకు సూచించింది. మరోవైపు నిట్‌కు నిరవధికంగా సెలవులు ప్రకటించడంతో తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు విద్యార్థులు.

ఇప్పటికే ఆర్మీ, వాయుసేనలను అప్రమత్తంగా ఉండమని కేంద్రం ఆదేశించింది. నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహించే రాష్ట్రీయ రైఫిల్స్‌తో పాటు ఇతర దళాలు రెప్ప వాల్చకుండా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి. సరిహద్దుల ఆవల నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నిస్తే తిప్పికొట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కేంద్ర బలగాల తరలింపునకు కేంద్రం వాయుసేనను రంగంలోకి దింపింది. పెద్ద విమానాలను ఇందు కోసం వినియోగిస్తున్నాయి. దీంతో తాజా పరిణామాలు కశ్మీర్‌లో క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి.

అటు ప్రజలే కాదు కశ్మీరీ రాజకీయ పార్టీల నేతలను కేంద్రం అడుగులు హడలెత్తిస్తున్నాయి. కశ్మీర్‌లో ప్రస్తుత పరిణామాలపై నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ను కలిసి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కశ్మీర్‌లో అసలు ఏం జరుగుతుందో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు. గత 30 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో సైనికులను మోహరించలేదని గుర్తుచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com