భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు: వెంకయ్యనాయుడు

- August 27, 2019 , by Maagulf
భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు: వెంకయ్యనాయుడు

విజయవాడ : ఏదైనా సమస్య వస్తే  ప్రపంచ దేశాలు గతంలో అమెరికా వైపు చూసేవని, ఇప్పుడు భారత్‌ వైపు చూస్తున్నాయని ఉప రాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్ర్రపతిగా రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం విజయవాడ గేట్‌ వే హోటల్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ రెండు సంవత్సరాల్లో నాకు ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేశానన్నారు. నా ఉన్నతికి పార్టీ,స్నేహితులే కారణమని తెలిపారు.

ఆనాడు చాలా బాధపడ్డా 
ఉప రాష్ట్ర్రపతి  పదవి ఇచ్చినప్పుడు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండవని ఎంతో బాధపడ్డానని  తెలిపారు. ఏ పదవిని..బాధ్యతలను ఎలా మరల్చుకోవాలనే నాకు బాగా తెలుసునని మోదీ అన్నారని గుర్తుచేశారు. మన జీవితానికి 64 కళలు ప్రేరణ ఇస్తాయని పేర్కొన్నారు. దౌత్య సంబంధాలు చాలా ముఖ్యమైనవని, 22 దేశాల్లో  పర్యటించానని తెలిపారు. దేశ ప్రజలకు సరైన మార్గనిర్ధేశనం చేయడం ఉప రాష్ట్ర్రపతి విధిగా పేర్కొన్నారు. రైతులు, యువత ఆవిష్కరణలను గుర్తించడం, దేశ ఔన్నత్యాన్ని విదేశాలకు తెలియజేయడం విధుల్లో భాగమని  తెలిపారు. దేశంలో సుమారుగా 500 జిల్లాలు పర్యటించి జన జీవనాన్ని బాగా అధ్యయం చేశారని తెలిపారు.

స్పీకర్‌ చర్యలు తీసుకోకపోతే ఎవరిని అడగాలి
మనం ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని.. రాజకీయ పార్టీలు, సభ్యులు ఉన్నత విలువలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. సంపదను పెంచి ప్రజలకు పంచాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్నారు. జ్యూడిషియల్‌లో కూడా వచ్చే మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని..జ్యూడిషియల్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి సైతం పదవులు ఇచ్చారని..దీనిపై స్పీకర్‌ చర్యలు కూడా తీసుకోలేదన్నారు. చర్య తీసుకోకపోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు.10వ షెడ్యూల్‌లో మార్పులు తీసుకురావాలని సూచించారు.

భాషను బలవంతంగా రుద్దకూడదు
దేశ ప్రగతికి  ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు.విద్యార్థులు స్ఫూర్తి పొందేవిధంగా వాస్తవ చరిత్రను తెలియజేయాలన్నారు. అన్ని రాష్ట్ర్ర  ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను మాతృ భాష లోనే బోధించాలని కోరారు. భాష అనేది సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఏ భాషను బలవంతంగా రుద్ద కూడదు..వ్యతిరేకించ కూడదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుపడాలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. బజారు మాటలు మాట్లాడేవారికి  ప్రాధాన్యత ఇవ్వకూదన్నారు.

భావోద్వేగానికి లోనయ్యా 
ఆర్టికల్‌ 370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు  కొంత భావోద్వేగానికి లోనయ్యానని.. గతంలో వలే తలుపులు వేసి,టీవీ కట్టేసి, బయటకు పంపేసిన పరిస్థితులునేను ఉన్నప్పుడు రాకూడదని అనుకున్నానన్నారు. 370 ఆర్టికల్‌ ఎప్పుడో రద్దు కావాల్సి ఉందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో 110 చట్టాలు కశ్మీర్‌కు వర్తిస్తాయన్నారు.పర్యాటకం వృద్ధి చెందుతుందన్నారు. ఆర్థికల్‌ 370 రాజకీయం అంశం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, టొబాకో బోర్డు ఛైర్మన్‌  రఘునాథ్‌ బాబు, తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com