సరిహద్దులో పాక్-చైనా యుద్ధ రిహార్సల్స్

- August 28, 2019 , by Maagulf
సరిహద్దులో పాక్-చైనా యుద్ధ రిహార్సల్స్

న్యూఢిల్లీ: పాకిస్థాన్, చైనాలు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం పెంచేలా వ్యవహరిస్తున్నాయి. తాజాగా, లడఖ్ సమీపంలో భారత సరిహద్దు వద్ద పాకిస్థాన్, చైనాలు సంయుక్తంగా యుద్ధ విమానాలతో రిహార్సల్స్ చేయడం ప్రారంభించాయి. ఈ దేశాల వ్యవహారాలను భారత వాయుసేన(ఐఏఎఫ్) నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

'చైనాకు చెందిన జె10, పాకిస్థాన్‌కు చెందిన జెఎఫ్-17 విమానాలు ఉత్తర లేహ్ సిటీ సమీపంలోని హోతన్ సిటీ ప్రాంతానికి 300 కిలోమీటర్ల దూరంలో యుద్ధ రిహార్సల్స్ చేశాయి' అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతంలోని స్కర్దు ఎయిర్‌బేస్ ద్వారా ఈ విమానాలు రిహార్సల్స్ చేశాయి. చైనా వాయుసేనతో కలిసి పాకిస్థాన్ ఇలాంటి రిహార్సల్స్ చేయడం ఇది చాలా కాలం తర్వాత కావడం గమనార్హం. భారతదేశానికి ఉత్తరంగా చైనాతో కలిసి బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది పాకిస్థాన్.

ఇప్పటికే భారతదేశానికి చెందిన చుమర్, డెంచక్ ప్రాంతాలను టిబెట్ ప్రాంతాలుగా చెబుతున్న చైనా.. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. ఇప్పుడు చైనాతో కలిసి యుద్ధ రిహార్సల్స్ చేయడం మరింత ఉద్రిక్తతను పెంచేలా ఉంది. కాగా, పాక్, చైనా యుద్ధ రిహార్సల్‌పై భారత్ ఓ కన్నేసి ఉంచింది. ఈ రెండు దేశాలు ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత భద్రతా దళాలు స్పష్టం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com