తెలుగురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

- September 18, 2019 , by Maagulf
తెలుగురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలను అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో బుధవారం, గురువారం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రా తీరానికి దగ్గరలోని బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ భార్షాలు పడే అవకాశం ఉంది.

ఇప్పటికే రాయలసీమలో ఉన్నట్టుండి కుండపోత భయపెట్టింది. కర్నూలు, కడప, అనంతపురం మూడు జిల్లాలనూ ఒక్కసారిగా వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. నదీ పరివాహక ప్రాంతాలను వరద చుట్టు ముట్టడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు జనం.

భారీ వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్‌ అతలాకుతలమైంది. వాగులు, పంట కాల్వలు పొంగి పొర్లాయి. రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. నంద్యాలలో చామకాలువ, కుందూనది పొంగి పొర్లుతున్నాయి. గాజులపల్లె రైల్వే స్టేషన్ కు 2 కి.మీ. దూరంలో రైల్వేట్రాక్ దెబ్బతింది. పలు రైళ్లను రద్దుచేశారు.

కర్నూలులోని మహానంది ఆలయం నీటమునిగింది. క్షేత్రచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయం జల దిగ్బంధమైంది. ప్రస్తుతం దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఇక్కడికి సమీపంలోనే ఉన్న ప్రథమ నందిని కుందూ చుట్టుముట్టేసింది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బయట ఉన్న రెండు కోనేర్లతోసహా ఆ ప్రాంతాన్ని వరదనీరు ముంచెత్తింది. రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు మేర నీరు చేరింది.

కడప జిల్లా ప్రొద్దుటూరులోని కామనూరు-రాజానగర్ మధ్య వాగులో ఆటో కొట్టుకుపోయి ముగ్గురు గల్లంతయ్యారు. రాయలసీమతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణా పరవళ్లు చూడడానికి వెళ్లిన ముగ్గురిలో ఒకరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రాళ్లవాగు పొంగి గుంటూరు- హైదరాబాద్ కు రాకపోకలు స్తంభించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com