పెరిగిన వెండి, బంగారం ధరలు

- October 07, 2019 , by Maagulf
పెరిగిన వెండి, బంగారం ధరలు

బంగారం ధరలు సోమవారం (అక్టోబర్ 7) పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.120 పెరిగి రూ.39,790కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బలమైన ట్రెండ్ సహా దేశీయ జ్యువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కారణంగా ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి రూ.36,480కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి రూ.2000 పెరిగి రూ.48,000 చేరుకుంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.38,450కి చేరుకోగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.37,250కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం 00.4 శాతం పెరిగి ఔన్సుకు 1,513 డాలర్లకు చేరుకుంది. వెండి ధర ఔన్సుకు 0.05 శాతం పెరిగి 17.63 డాలర్లకు చేరుకుంది. ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అమెరికా - చైనా మధ్య అక్టోబర్ 10-11 తేదీల్లో చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోను నెలకొంది.

ఇటీవల భారత్‌లో బంగారం ధర రూ.40,000 మార్క్ చేరుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గుతూ వస్తోంది. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో బంగారం ధర పెరగడంతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుందని జ్యువెల్లర్స్ ఆశలతో ఉన్నారు. మరోవైపు, సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు 70 శాతం మేర పడిపోయాయట.

మరోవైపు, సావరీన్ గోల్డ్ బాండ్ల 2019-20 సిరీస్ V సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు ప్రారంభమైంది. గ్రాము బంగారం ధర రూ.3,788గా నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.50 తగ్గింపు ఉంటుంది. అంటే డిజిటల్ మోడ్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.3,738కే అందుబాటులోకి వస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 11. సబ్‌స్రైబర్లకు అక్టోబర్ 15వ తేదీన బాండ్స్ జారీ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com