గల్ఫ్ కార్మికుల గుండెపోటు మరణాలకు కారణాలు, నివారణ చర్యలపై పరిశోధన

గల్ఫ్ కార్మికుల గుండెపోటు మరణాలకు కారణాలు, నివారణ చర్యలపై పరిశోధన

తెలంగాణ:ఎడారి దేశాలలో పనిచేస్తున్న భారతీయ కార్మికులు హృదయ సంభందిత అనారోగ్యం, గుండెపోటు వలన చనిపోవడానికి దారితీస్తున్న పరిస్థితులు, కారణాలు - నివారణ, ప్రభుత్వాల బాధ్యత అనే అంశంపై అధ్యయనం చేయడానికి బెంగుళూరుకు చెందిన నిఖిల్ ఈపెన్ అనే పరిశోధకుడు మూడురోజులపాటు ఈనెల 15 నుండి 17వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ఏడుగురు గల్ఫ్ మృతుల కుటుంబాలను కలిశారు. 

గురువారం (17.10.2019) జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో గల్ఫ్ మృతుడు దండుగుల జనార్దన్ కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించారు. పరిశోధకుడు నిఖిల్ వెంట ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్ది, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లాల జయపాల్, న్యాయవాది చెన్న విశ్వనాథం, ఎఐటియుసి నాయకులు ఇస్మాయిల్ ఉన్నారు. గత రెండురోజులుగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట, నిజామాబాద్ జిల్లా దిచుపల్లి మండలం రాంపూర్, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మరిపేట, మన్నెగూడెం, మెటుపల్లి మండలం మెట్ల చిట్టాపూర్ కు చెందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులను కలిశారు. 

గల్ఫ్ దేశాలలో వలసకార్మికులు గుండెపోటుతో చనిపోవడానికి పలు కారణాలను ఈ పర్యటన సందర్బంగా గమనించినట్లు పరిశోధకుడు నిఖిల్ తెలిపారు. పగలు ఎండలో.. రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు  అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు తన పరిశీలనలో వెల్లడయ్యాయని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం, గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు కార్మికుల ఆరోగ్యాలపై, మరణాలపై సమగ్ర విశ్లేషణ చేసి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు. తన అధ్యయన నివేదికను ప్రభుత్వాలకు అందజేస్తానని, జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా వ్యాసాల రూపంలో వెల్లడిస్తానని నిఖిల్ వివరించారు. 

గల్ఫ్ మరణాలను ఆన్ డ్యూటీ, వృత్తి సంబంధ మరణాలుగా పరిగణించాలి

గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోతున్న వలసకార్మికుల మరణాలను ఆన్ డ్యూటీ, వృత్తి సంబంధ మరణాలుగా పరిగణించాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్ది అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులను పంపే భారత దేశం లాంటి దేశాలు, కార్మికులను స్వీకరించే గల్ఫ్ దేశాలు ఈ విషయంపై సమగ్రమైన చర్చ జరుపాలని ఆయన కోరారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాసులు ఏ కారణం వలన అక్కడ చనిపోయినా ఆన్ డ్యూటీ (విధి నిర్వహణ) లోనే చనిపోయినట్లేనని భీంరెడ్డి అభిప్రాయపడ్డారు. పరాయిదేశంలో పనిప్రదేశంలో, నివాసంలో, ఆసుపత్రిలో ఎక్కడ ప్రాణం పోయినా..  కారణం మాత్రం వృత్తికి సంబంధమైనదేనని ఆయన అన్నారు. 

గల్ఫ్ మృతులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి 

గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల క్స్ గ్రేషియా చెల్లించాలని ఈ సందర్బంగా న్యాయవాది, సిపిఐ నాయకులు చెన్న  విశ్వనాథం డిమాండ్ చేశారు. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) వెంటనే ప్రకటించాలని, ఎన్నారై శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలని ఆయన కోరారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ వలసలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.

ఖతార్ లో గుండెపోటుతో మృతి చెందిన దండుగుల జనార్దన్ తల్లి నర్సు, భార్య లక్ష్మి, కుమారులు అనిరుద్ (03), శశాంక్ (08) లతో పరిశోధక బృంద సభ్యులు

ఖతార్ లో గుండెపోటుతో మృతి చెందిన దండుగుల జనార్దన్ భార్య లక్ష్మి, కుమారులు అనిరుద్ (03), శశాంక్ (08) లతో పరిశోధక బృంద సభ్యులు

Back to Top