చిదంబరానికి బెయిల్.. అయినా కస్టడీలోనే: మరో 48 గంటల పాటు తీహార్ జైలులో విచారణ
- October 22, 2019
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు, పాస్ పోర్టును స్వాధీనం చేయాలని షరతులు విధించింది. బెయిల్ లభించినప్పటికీ..ఇంకా విచారణలోనే కొనసాగాల్సి వస్తోంది చిదంబరానికి. కారణం.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో ఆయన బెయిల్ లభించలేదు. ఫలితంగా గురువారం వరకు ఆయన తీహార్ జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్..
ఐఎన్ఎక్స్ మీడియాలో 310 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం చోటు చేసుకున్న ఘటనలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఈడీ అధికారులు చిదంబరంపై వేర్వేరుగా కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో ఉంటూ ఆయన సీబీఐ, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసుకున్న పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసి పుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ చిదంబరం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటీషన్ ను దాఖలు చేశారు. దీన్ని ఇదవరకే విచారణకు స్వీకరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం.
రెండు నెలలుగా విచారణ.. సాక్ష్యాధారాలేవీ?
మంగళవారం ఉదయం ఈ పిటీషన్ పై విచారణ చేపట్టింది. పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల చిదంబరానికి బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేయగలరని, సాక్ష్యులను ప్రభావితం చేయగలరని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కీలక మైన కేసు అయినందు వల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. దీనిపై చిదంబరం తరఫు న్యాయవాది వాదిస్తూ.. రెండు నెలలకు పైగా చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇన్ని రోజులైనప్పటికీ.. ఒక్క సరైన సాక్ష్యాధారాలను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయారని వాదించారు.
షరతులతో కూడిన బెయిల్..
ఇరు పక్షాల వాదోపవాదాలను విన్న తరువాత సుప్రీంకోర్టు.. చిదంబరం తరఫు న్యాయవాదితో ఏకీభవించారు. రెండు నెలల కాలంలో సీబీఐ అధికారులు సరైన సాక్ష్యాధారాలను ఎందుకు సేకరించలేకపోయారని ప్రశ్నించింది. దీనిపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయార సీబీఐ తరఫు న్యాయవాది. దీనితోో- చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. లక్ష రూపాయల పూచీకత్తు, పాస్ పోర్టును స్వాధీనం చేయాలని ఆదేశించింది. బెయిల్ సమయంలో దేశం విడిచి వెళ్లరాదని సూచించింది.
ఈడీ కస్టడీలోనే చిదంబరం..
కాగా- ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనే ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కారణంగా చిదంబరం గురువారం వరకూ తీహార్ జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది. గురువారం నాటికి ఈడీ కస్టడీ ముగుస్తుంది. కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ అధికారులు రోజ్ వేలీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కస్టడీని పొడిగించాలా? వద్దా? అనే విషయంపై రోజ్ వేలీ న్యాయస్థానం తీసుకునే నిర్ణయం మీదే చిదంబరం బయటికి రాగలుగుతారా? లేదా? అనేది ఆధార పడి ఉంది. కస్టడీని పొడిగించకపోతే.. ఆ వెంటనే- చిదంబరం తీహార్ జైలు నుంచి బయటికి రాగలుగుతారు.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







