తెలుగు లోగిళ్ళకు "తొలికాంతి"
- January 13, 2016
తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప శుభవేళ సంక్రాంతి. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి.అన్నదాతలైన రైతులు కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకుచేరి నట్టింట కొలువుదీరే పండుగ మన సంక్రాంతి పండుగ. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగబంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. అసలు సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యేకత వుంది. సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన నాటినుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది 30 రోజుల సంబరం. మూలానక్షత్రం ప్రారంభరోజున వుండడం కూడా ముఖ్య అంశం. ఈ సమయములోనే వాతావరణంలో మార్పులు వచ్చి చలి మొదలౌతుంది.ఈ చలి కాలంలో మగువలు ఉదయాన్నే లేచి రంగవల్లులు తీర్చిదిద్దుతారు. స్త్రీలు వేకువజామున బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి ఆవుపేడతో వాకిలి కళ్ళాపి జల్లి ముగ్గులు తీర్చిదిద్దేందుకు తయారుచేస్తారు. చక్కటి ముగ్గులో కళాత్మకంగా రంగులద్ది కొత్త సొబగులు తెస్తారు. ముగ్గుల మధ్య ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి పసుపురంగు పూలతో అలంకరిస్తారు. గుమ్మడి పూలు, తంగేడు పూలతొ అలంకరించిన గొబ్బెమ్మలు ముంగిళ్ళను కొత్త అందాలతో నింపుతాయి.‘వచ్చింది, వచ్చింది, సంక్రాంతి- తెచ్చింది, తెచ్చింది నవకాంతి
ముత్యాల ముగ్గుల్లు ముంగిళ్ళు నిండాయి – ముగ్గుల్లో గొబ్బిళ్ళు ముచ్చట్లు గొలిపాయి’
అంటూ సంక్రాంతిని గొప్పగా వర్ణించవచ్చు. ఈ ముగ్గు చుట్టూ మగువలు, బాలికలు లయబద్ధంగా అడుగులు వేస్తూ గొబ్బి తట్టుతారు.
‘ఆవులమ్మా గోవులమ్మా రమణమల్లియ గొబ్బియల్లో
ఏ మేతమేసినవే రమణమల్లియ గొబ్బియల్లో
కొండమేత మేసినవే రమణమల్లియ గొబ్బియల్లో’
అంటూ గొబ్బి పాటలు పాడటం కనులపండుగగా ఉంటుంది. ఈ విధంగా చేయడంలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి వున్నాయి.అంతేకాక హరిదాసు రాక, జంగమయ్య దీవెనలు, బుడబుక్కలవాని ఢమరుకనాదం, గంగిరెద్దుల వాని ఆట ఈ పండుగ సందడిలో ఒక భాగం. హరిదాసు అలంకరణ ఒక ప్రత్యేకత. నుదుటన తిరుచూర్ణం, చేతిలో చిడుతలు, తలమీద గుమ్మడికాయ ఆకారంలో వున్న పాత్ర, తంబుర నాదంతో ‘హరిలో రంగ హరీ’ అంటూ చేసే సందడి కొత్త కళను తెస్తుంది. అంబపలుకు, జగదంబపలుకు అంటూ బుడబుక్కల వాని పలుకులు వేకువజాముని జాగృతిని చేస్తాయి. జంగమయ్య దీవెనలతో వీధులన్నీ మార్మోగుతాయి.పతంగాలు ఎగురవేసి పిల్లలు, పెద్దలు చేసే సందడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకం. రంగు రంగుల గాలిపటాలను తయారుచెయ్యడం, మాంజాలను తయారు చేయడం, పోటా పోటీగా గాలిపటాలను ఎగురవేయడంతో ఈ నెలంతా పిల్లలకు ఉత్సాహమే, ఉల్లాసమే.భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఏడాది పండుగ అనే పేర్లతో పిలుచుకొనే ఈ 5 రోజుల సంక్రాంతి పండుగ సర్వజనావళికి ఆనందదాయకం. భోగి మంటల భగభగలు అందరిలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ భోగి మంటల్లో తాటాకులతొ పాటు ఇంటిలోని పాత సామానులు కూడా వేసి ఇంటికి కొత్త అందాలను సమకూరుస్తారు. భోగిమంటపై కుండతో నీళ్ళు కాచుకొని తలస్నానాలు చేస్తారు. ఈ మంటపై తేగలు కాల్చుకొని అక్కడే కూర్చుని తినడం ఒక గొప్ప అనుభూతి. సాయంత్రం పసిపిల్లలకు భోగిపళ్లు తలపై పోయడం పిల్లలకు దీవెన అందిచడమే. పేరంటం జరిపి చిన్న చిన్న బొమ్మలు, కుంకుమ భరిణలను కానుకలుగా ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ మూడు రోజులు బొమ్మల కొలువు కూడా పెడతారు.భోగి మరుసటిరోజు సంక్రాంతి. ఈ రోజు సూర్యుడు ధనుస్సు రాశిలోంచి మకర రాశి లోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగకు మకర సంక్రాంతి అని కూడా పేరు. కుటుంబంలోని వారు వారి పితృదేవతలను తలచుకొని పూజించడం, వారికి వస్త్రాలు పెట్టడం, పొంగలి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. కనుకనే ఈ పండుగను పెద్దల పండుగ, పొంగల్ అనికూడా పిలుస్తారు. ఈ పండుగ ప్రత్యేకత పిండివంటలు. బెల్లం, నువ్వులు వంటి పదార్ధాలను వినియోగించి చేసిన అరిసెలు, బూరెలు, చక్కిలాలు, లడ్డూలు, మురుకులు వంటి పిండివంటలు తినడం చలివాతావరణానికి రక్షణకారి కూడా.మూడవనాడు కనుమ పండుగ. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. భారతదేశం పాడి పంటలకు నెలవు. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాధారం. అందుకనే పశువులకు కృతజ్ఞత చూపించడం ఈ కనుమ పండుగ ప్రాముఖ్యం. పశువులను శుభ్రపరచి వాటి కాళ్ళకు గజ్జెలు కట్టి, కొమ్ములకు రంగులు వేసి మెడలో పూలతో అలంకరించడం ఆనవాయితి. పశువుల పాకను శుభ్రం చేసి రకరకాలుగా అలంకరిస్తారు. పశువుల పాకలో పొంగలి పెట్టి పశువులను గౌరవిస్తారు.
తరువాతి రోజు ఏడాది పండుగ. ఆ రోజు సాయంకాలం మగువలు, బాలికలు చక్కగా అలంకరించుకొని గొబ్బెమ్మలను ఓలలాడిస్తారు. నెలరోజులు గొబ్బెమ్మలకు పాటలు పాడి, పూజలు చేసిన స్త్రీలు గొబ్బిళ్ళు తట్టుతూ ఉరేగింపుగా ఊరిచివర కాలువలకు గాని, చెరువులకు గాని తీసుకొని వెళ్లి సరదాగా జానపద గీతాలు పాడుతూ నీళ్ళలో ఓలలాడిస్తారు.అందరూ కలిసి చేసికొని తెచ్చిన వంటలు, పిండివంటలను ఒకరికొకరు పంచుకొని తింటూ సరదాగా గడుపుతారు. ఇలాంటి తెలుగువెలుగుల సంక్రాంతి సంరంభాలలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని, అంతులేని అనిర్వచనీయమైన అనుభూతులను పొందుతారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







