మళ్లీ మాంద్యం తప్పదా..?

- January 16, 2016 , by Maagulf

మార్కెట్ల చరిత్రలో అత్యంత గడ్డుకాలంగా నమోదైంది. చైనా మందగమన భయాలు, క్రూడ్ ధరల క్షీణతతో అమెరికన్ సూచీలు 6 శాతం మేర నష్టపోయాయి. దాంతో మార్కెట్ వర్గాల సంపద దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల మేర తరిగిపోయింది. అంతేకాదు వరుసగా రెండో త్రైమాసికంలోనూ స్టాండర్డ్ అండ్ పూర్స్ 500 సూచీలోని కంపెనీల ఆదాయం తగ్గుదలను నమోదు చేసుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2009 ఆర్థిక మాంద్యం తర్వాత వరుసగా రెండు త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయం తగ్గుముఖం పట్టడం చాలా అరుదైన సంఘటనగా వారు అభివర్ణిస్తున్నారు. 

అంతేకాదు ఈఏడాదిలో అమెరికా మళ్లీ మాంద్యంలోకి జారుకోనుందని ది గ్లూమ్, బూమ్ అండ్ డూమ్ ఎడిటర్, పబ్లిషర్ అయిన మార్క్ ఫాబర్ హెచ్చరించారు. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మార్చి లేదా జూన్‌లో వడ్డీరేట్లను మళ్లీ తగ్గించాల్సి రావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతున్నదని ఫెడ్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్‌కు తప్ప మరెవరీ అన్పించట్లేదంటూ ఆయన ఛలోక్తి కూడా విసిరారు. తాజా పరిణామాలను చూస్తుంటే.. ప్రపంచం మరోసారి ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్న సంవత్సరంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే అవకాశం లేకపోలేదని నిపుణులంటున్నారు. 
గతవారంలో ప్రపంచబ్యాంకు.. 2016 సంవత్సరానికి గ్లోబల్ జీడీపీ అంచనాలను 2.9 శాతానికి కుదించింది. జూన్‌లో విడుదల చేసిన నివేదికతో పోలిస్తే వృద్ధి అంచనాలను 0.4 శాతం మేర తగ్గించింది. చైనా, బ్రెజిల్, రష్యా వంటి వర్ధమాన దేశాల్లో మందగమనం ఇందుకు కారణమని పేర్కొంది. 

రష్యా, బ్రెజిల్‌లు ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇన్నాళ్లూ ప్రపంచ వృద్ధికి చోదకంగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ కూడా మందగించడంపై వరల్డ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ ఏడాదిలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సభ్య దేశాలన్నీ ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉందని, ఫలితంగా ప్రపంచ వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం పడొచ్చని హెచ్చరించింది. 1980లో ప్రపంచ జీడీపీలో వర్ధమాన, పేద దేశాల వాటా 36 శాతంగా ఉండేది. ఇప్పుడా వాటా 56 శాతానికి పెరిగింది. ఈ మూడు దశాబ్దాల్లో వర్ధమాన దేశాలు భారీగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది. అయితే ఇప్పుడు చైనా, బ్రెజిల్, రష్యా వంటి అతిపెద్ద వర్ధమాన దేశాల వృద్ధి మందగించడం ఆందోళన కలిగిస్తున్నది. బ్రిక్స్ సభ్య దేశాల్లో ఇండియా పనితీరే కాస్త ఫర్వాలేదన్పిస్తున్నది. అయితే చైనా పరిణామాలు మున్ముందు మన దేశంపై ఏమేర ప్రభావం చూపనుందన్న అంశం కూడా కీలకంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com