పెట్టుబడుల ఒప్పందాల ఆకర్షించేందుకు దావోస్ వెళ్లనున్నాచంద్రబాబు...
- January 17, 2016
భాగస్వామ్య సదస్సు పేరిట నవ్యాంధ్రప్రదేశ్‌కు మూడు రోజుల్లోనే దాదాపు రూ.5.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలను సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... మరిన్ని పెట్టుబడుల ఆకర్షించేందుకు దావోస్ వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. నవ్యాంధ్ర సీఎంగా గత ఏడాది దావోస్‌లో పర్యటించిన చంద్రబాబు... అక్కడికి వచ్చిన పారిశ్రామిక వేత్తలను కలుసుకుని పెట్టుబడులు ఆకర్షించారు. ఈ ఏడాది పాల్గొనేందుకు ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధి బృందంతో కలిసి సోమవారం బయలుదేరనున్నారు. వీలైనన్ని పెట్టుబడులతో రాష్ట్రానికి తిరిగి రావాలని ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సులో జాతీయ అంతర్జాతీయ అంశాలపై సదస్సులు ఉంటాయి. నాలుగు రోజల పాటు జరిగే సదస్సులో భాగంగా పలు ప్లీనరీ సదస్సులు ఉంటాయి. ఈ సదస్సుల్లో జాతీయ, అంతర్జాతీ ప్రముఖులు పాల్గొంటారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, దేశీయ పారిశ్రామిక ప్రముఖులు పలు ప్లీనరీ సదస్సుల్లో మాట్లాడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు, పరిశ్రమలు, ప్రభుత్వాలు, యూనివర్శిటీలను నిర్వ హిస్తున్న మహిళా ప్రముఖులు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రపంచానికి సవాల్‌గా మారిన సంక్షోభాలపై ప్రత్యేక నివేదిక ఇప్పటికే విడుదల చేసింది. వలసలు, నీటి యుద్ధాలు, వాతావరణంలో మార్పులు, నిరుద్యోగం, ఆహార సంక్షోభం, సామాజిక అసమతుల్యం ఈ నివేదికలో ప్రధానంగా ఉన్నాయి. దేశంలోనూ దావోస్ లాంటి వేదిక అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖలో శాశ్వత వేదిక ఏర్పాటుకు సహకరిస్తామని ఇటీవల భాగస్వామ్య సదస్సులో పేర్కొన్నారు. మరోవైపు పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అక్కడికి వచ్చే ప్రముఖులకు వివరించనున్నారు. ఏపీని మీ వ్యాపార కేంద్రంగా మార్చుకోండి.. వారం రోజుల నుంచి ఏపీ ప్రచార రథం దావోస్ వీధుల్లో తిరుగుతోంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ వూహాచిత్రం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక పెట్టుబడులకు కల్పిస్తున్న వాతావరణానికి సంబంధించిన వివరాలు ఆ బస్సుపై ప్రచురించారు. ఈ బస్సు స్విస్‌లోని సదస్సు వేదికతో పాటు చుట్టూ ప్రాంతాల్లోనూ చక్కర్లు కొడుతోంది. 'ఏపీని మీ వ్యాపార కేంద్రంగా మార్చుకోండి'(మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్), 'మీ అవకాశాలను వెతుక్కోండి, ఏపీ మిమ్మల్ని పిలుస్తోంది' అనే నినాదంతో కదులుతోంది. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ సదస్సులో ఏపీకి బ్రాండింగ్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న తొలిప్రయోగంగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన హోర్డింగులు దావోస్ నగరంలో స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. హోర్డింగులు, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు అక్కడి వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను యూట్యూబ్‌లో సర్కారు అప్లోడ్ చేసింది. ప్రత్యేక లాంజ్... ఉషోదయ ఆంధ్రప్రదేశ్(సన్‌రైజ్ ఏపీ)కి సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక లాంజ్‌ను ఏపీ ప్రభుత్వం దావోస్‌లో ఏర్పాటు చేసింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తుంది. ఇక్కడ ఏపీలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం వచ్చే వారికి రాష్ట్రంలోని వనరులు, ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలు, వ్యాపారానికి ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు వివరిస్తారు. ఉడుపి పర్యాయ వేడుకకు చంద్రబాబు.. కర్ణాటకలో ప్రఖ్యాత ఉడుపి క్షేత్రంలో నిర్వహించే పర్యాయ వేడుకలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు. పెజావర పీఠాధిపతి విశ్వేశతీర్థ అయిదోసారి ఉడుపి క్షేత్ర పర్యాయ బాధ్యతలు చేపడుతున్నారు. సోమవారం ఇందుకు సంబంధించి నిర్వహించే వేడుకలో చంద్రబాబు పాల్గొంటారు. భాజపా సీనియర్ నేత ఎల్.కె.అడ్వానీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఈ పర్యాయకి హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







