కరోనా ఎఫెక్ట్: ఇరాన్ నుంచి ముంబై చేరుకున్న 234 మంది భారతీయులు

- March 15, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్: ఇరాన్ నుంచి ముంబై చేరుకున్న 234 మంది భారతీయులు

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇరాన్, ఇటలీలో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది. ఇరాన్ నుంచి 234 మంది భారతీయులు ముంబై చేరుకున్నారు. ఇటలీ మిలన్ నుంచి 218 మంది భారతీయులు స్వదేశానికి బయలుదేరారు. ఇరాన్ లోని భారత అంబాసిడర్, వైద్యులు, ఇరాన్ అధికారులకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది. దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కరోనా వైరస్‌ వల్ల మరణించిన వారి కుటుంబాలకు విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా సహాయమందిస్తారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారికి ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. పద్మ అవార్డులపై కరోనా ప్రభావం పడింది. ఏప్రిల్‌ 3న రాష్ట్రపతి భవన్‌లో జరగాల్సిన అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది.

కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు బంద్ చేశారు. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లు, పబ్ లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు నో ఎంట్రీగా ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధించారు. భూటాన్ సరిహద్దును పశ్చిమబెంగాల్ మూసివేసింది. కరోనా విస్తరించకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,821 మంది చెందారు. లక్షా 56 వేల 433 మంది బాధితులు ఉన్నారు. 5 వేల 909 మందికి సీరియస్ అయింది.
కరోనాపై పోరుకు నేతలు ఉమ్మడి వ్యూహం ఖరారు చేయనున్నారు. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లినవారి నుంచే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇటలీలో నిన్న ఒక్కరోజే 3497 కేసులు నమోదు కాగా, 175 మంది మృతి చెందారు. ఇరాన్ లో నిన్న 1365 కేసులు నమోదు కాగా 97 మంది చెందారు. స్పెయిన్ లో 1159 కేసులు నమోదు, 62 మంది మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com