కరోనాపై పోరు: ఎస్పీబీ వినూత్న ప్రయత్నం
- March 26, 2020
హైదరాబాద్: భాషతో సంబంధం లేకుండా తన సుమధుర గానంతో శ్రోతలను పరవశింపజేసే గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అందుకే అభిమానులు ఆయనను గాన గంధర్వుడు అని పిలుచుకుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కూడా తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే, ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఇందుకోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ వివరాలన్నీ తన ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు.
‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటున్నా. పారిశుద్ధ్య, పోలీస్, వైద్యులకు ఏదైనా సాయం చేయాలనుకుంటున్నా. అందుకుకోసం శ్రోతలు, నెటిజన్లకు అవకాశం ఇస్తున్నా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మీకు నచ్చిన పాట పాడమని నన్ను అడగొచ్చు. అది సినిమా పాటైనా భక్తి గీతమైనా ఏదైనా కావచ్చు. ఎవరు ముందు అడుగుతారో వారికే అవకాశం ఉంటుంది. వచ్చే శనివారం, సోమవారం, బుధవారం, గురువారాల్లో అరగంట పాటు రాత్రి 7గంటల నుంచి 7.30 వరకూ మీరు కోరిన పాటలు నేను పాడతా’’
‘‘ఒక రోజుకీ మరో రోజుకీ విరామం ఎందుకు ఇచ్చామంటే మీరు కోరిన అన్ని పాటలూ నాకు గుర్తు ఉండకపోవచ్చు. అందుకోసం నేను కసరత్తు చేసి, మీరు కోరిన పాటను మరుసటి రోజు పాడి రికార్డు చేసి వినిపిస్తా. ఇందుకు సాధారణ రుసుము రూ.100 చెల్లించాలి. ఇంత మొత్తం సేకరించాలన్న లక్ష్యం ఏమీ లేదు. అలాగే వచ్చిన మొత్తాన్ని ఎలా వినియోగించాలనే విషయంపై కూడా మీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటా. ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వాలా? లేక ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇవ్వాలా? అన్నది మీరే చెప్పవచ్చు. మీరు ఏ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించాలో ఆ వివరాలను నా ఫేస్బుక్ ఖాతాలో పంచుకుంటా. లావాదేవీలు చాలా పారదర్శకంగా ఉంటాయి. అరగంటలో మొత్తం పాట పాడితే నాలుగైదుకు మించిరావు. అందుకే ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే పాడతా. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నా’’ అని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







