కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా రివ్యూ..

- February 12, 2016 , by Maagulf
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా రివ్యూ..

కృష్ణగాడి వీర ప్రేమగాథ
నటీనటులు: నాని, మెహరీన్‌, సత్యం రాజేష్‌, సంపత్‌రాజ్‌, మురళీశర్మ, పృథ్వీ, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అన్నపూర్ణమ్మ తదితరులు
కథ- కూర్పు:
ఎమ్‌.ఆర్‌.వర్మ, ఛాయాగ్రహణం: యువరాజ్‌, సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌, నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర, దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాణసంస్థ: 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి॥, విడుదల తేది : 12 ఫిబ్రవరి 2016
ఇటీవల కొంత మంది యువ దర్శకులు కొత్త తరహా కథల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ల ఆలోచనల్ని ప్రోత్సహించి పట్టం కట్టడమే కావాలిప్పుడు. యువ కథానాయకులు సైతం... ప్రేక్షకులకు ఏం కావాలో, వాళ్లు ఎలాంటి సినిమాలు చూస్తున్నారో బాగానే అర్థం చేసుకొంటున్నారు. అందుకే ఎప్పట్లా మూస ధోరణిలో సాగే కథలు కాకుండా తెలుగు తెరపై నవ్యత కనిపిస్తోంది. చిత్రసీమకి కొంతకాలంగా అనూహ్యమైన విజయాలు దక్కుతున్నాయంటే కారణం అదే. ఆ పరంపరని కొనసాగించేలా మరో చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే... 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. నిజానికి ఇదో సాధారణ ప్రేమకథే. కానీ ఆ కథని కొత్త నేపథ్యంలో.. ఇతర హంగుల్ని జోడించడంలో దర్శకుడు కొత్తదనం చూపడం ఆకట్టుకుంటుంది. కథేంటంటే..: కృష్ణ (నాని) హిందూపురం నియోజకవర్గంలోని ఓ పల్లెటూరి కుర్రాడు. నటుడు బాలకృష్ణ అంటే ఇతనికెంతో ఇష్టం. అయితే.. కృష్ణ స్వతహాగా బాగా భయస్తుడు. అందుకే 15 ఏళ్లుగా ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న మహాలక్ష్మి (మెహరీన్‌)ని.. వాళ్లన్నయ్యకి భయపడి పెళ్లి చేసుకోకుండా తిరుగుతుంటాడు. వూరి పెద్ద, ఫ్యాక్షనిస్టు అయిన రాజన్న (మహదేవన్‌)కు నమ్మినబంటు మహాలక్ష్మి అన్నయ్య రామరాజు(రామకృష్ణ). అయితే అనుకోకుండా ఆ రామరాజే కృష్ణ దగ్గరకు ముగ్గురు చిన్న పిల్లల్ని తెచ్చి.. వాళ్లని అతనికి అప్పజెప్పి.. వీళ్లని నువ్వు కాపాడితే నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తా.. అంటాడు. ఆ ముగ్గురూ ఏసీపీ శ్రీకాంత్‌(సంపత్‌) పిల్లలు. ఇంతకీ రాజన్నకీ, ఏసీపీ శ్రీకాంత్‌కీ మధ్య సంబంధమేంటి? కృష్ణ, మహాలక్ష్మిల ప్రేమకథలోకి మాఫియా డాన్‌ డేవిడ్‌ ఇబ్రహీం (మురళీశర్మ) ఎలా వచ్చాడు? మరి తనకి అప్పజెప్పిన ముగ్గురి పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కృష్ణ సమర్థంగా నెరవేర్చేడా లేదా? మహాలక్ష్మితో కృష్ణ పెళ్లయిందా? తదితర విషయాల్ని వెండి తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే..?: తెలుగు ప్రేక్షకులకు పిరికి ప్రేమికుల కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుసు. అలాగే.. ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన సినిమాల గురించీ బాగా తెలుసు. మాఫియా డాన్‌ల కథలూ కొత్తవేం కాదు. అయితే.. ఒకే సినిమాలో ఈ మూడింటిని సందర్భానుసారంగా మిక్స్‌ చేయడం మాత్రం అరుదే! దర్శకుడు హను రాఘవపూడి చాలా తెలివిగా ఈ మూడు అంశాల్ని కథతో ముడిపెట్టి స్క్రిప్టు రాసుకొన్నాడు. కానీ.. ఈ మూడు ప్లాట్లు పరిచయమయ్యే వరకూ ప్రేక్షకుల్లో చాలా మంది.. ఏంటి..? కథ ఎక్కడెక్కడో తిరుగుతోంది..? అన్న భావనకు లోనయ్యే అవకాశముంది. ఆ తర్వాత ఒక్కసారి కథ అర్థమయ్యాక.. ఇక అందరిలోనూ మరింత ఆసక్తి మొదలవుతుంది! ప్రతి సన్నివేశాన్నీ దర్శకుడు ఎంతో నేర్పుగా, ప్రేక్షకుడి బుర్రకి పని పెట్టేలా తీశాడు. అదే సమయంలో వినోదాన్నీ జోడించారు. అయితే.. మరీ వినోదం కోసమని కాస్త సాగదీస్తున్నారేమో అన్న భావన కలుగుతుంది. తొలి సగం కథంతా రాజన్న ఫ్యాక్షనిజం, కృష్ణ- మహాలక్ష్మిల ప్రేమ సన్నివేశాలతో హాయిగా సాగిపోతుంది. కృష్ణ, మహాలక్ష్మిల ప్రేమకి ఫ్యాక్షనిజమే విలనేమో అని ప్రేక్షకులు భావించే దశలో.. కథను మలుపుతిప్పడం బాగుంది. ఆపైనా.. పలు మలుపులు తిప్పినా.. ప్రేక్షకులు గందరగోళానికి గురికాకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డారు. కథలో అంతర్భాగంగానే కామెడీ ఉండటం బాగుంది. నాని, సత్యం రాజేష్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్‌ అయ్యింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే బ్రహ్మాజీ పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. మలి సగంలో మురళీశర్మ, ప్రభాస్‌ శ్రీనులతో కలిసి ఎస్సై జమదగ్ని పాత్రలో పృథ్వీ పండించే హాస్యం ఆకట్టుకుంటుంది. డేవిడ్‌ ఇబ్రహీం పెద్ద మాఫియా డాన్‌ అయినా... అతన్ని సాదాసీదాగా ట్రీట్‌ చేసే విధానం నవ్విస్తుంది. ఈ కథకి చిన్న పిల్లల పాత్రలూ కీలకమే. వినోదంతో పాటు భావోద్వేగాలు పండడానికీ ఆ పాత్రలు బాగా పనికొచ్చాయి. ఎవరెలా చేశారంటే..?: ఒకట్రెండు హిట్లు రాగానే మాస్‌ ఇమేజ్‌ అంటూ ఆ దిశగా ఆలోచించే కథానాయకులకి భిన్నంగా నాని ప్రయాణం చేస్తున్నాడు. ఈ చిత్రం ఆ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. పిరికి ప్రేమికుడిగా కనిపిస్తూ చక్కటి వినోదాన్ని అందించాడు నాని. మహాలక్ష్మిగా మెహరీన్‌ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. ఏసీపీ శ్రీకాంత్‌గా సంపత్‌రాజ్‌, మహాలక్ష్మి అన్నయ్య రామరాజుగా రామకృష్ణ తమ పరిధిలో బాగా నటించారు. అన్ని పాత్రల్నీ సమతూకంతో నడపడంలో స్క్రీన్‌ప్లే ప్రముఖ పాత్ర పోషించింది. సాంకేతికంగా.. : దర్శకుడిగా హను రాఘవపూడికి మంచి మార్కులు వేయచ్చు. అద్భుతమైన స్క్రిప్టు రాసుకోవడంతో పాటు దాన్ని అంతే ప్రతిభావంతంగా తెరకెక్కిండం కత్తిమీద సామే. దాన్ని హను సమర్థవంతంగా నిర్వర్తించాడనిపిస్తుంది. యువరాజ్‌ ఛాయాగ్రహణం, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం సినిమా భావోద్వేగాల్ని చక్కగా క్యారీ చేశాయి. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌ మరింత పదునుగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
+ నాని, సత్యం రాజేష్‌, పృథ్వీ, సంపత్‌ల నటన + చక్కటి కథ.. కథనాలు + హను దర్శకత్వం    - స్లో అనిపించే నెరేషన్‌
చివరగా.. : నిజంగానే ఈ కృష్ణగాడు.. వీర ప్రేమికుడే!
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com