25 శాండీ పార్కింగ్ ప్రాంతాలను మూసివేసిన షార్జా మున్సిపాలిటీ

- November 12, 2020 , by Maagulf
25 శాండీ పార్కింగ్ ప్రాంతాలను మూసివేసిన షార్జా మున్సిపాలిటీ

షార్జా:షార్జా మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు 25 పార్కింగ్ ప్రాంతాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మున్సిపాలిటీ పరిధిలో అక్కడక్క ఖాళీగా ఉన్న ప్రాంతాలను ఇన్నాళ్లుగా పార్కింగ్ స్థలాలుగా వాడుతూ వస్తున్నారు. అయితే..అక్కడ ఎలాంటి పార్కింగ్ ఏర్పాట్లు ఉండవు. మట్టి, ఇసుకతో ఉన్న ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. వీటినే శాండీ పార్క్ ఏరియాగా పిలుస్తుంటారు. కొన్నాళ్లుగా ఈ శాండీ పార్కింగ్ ప్రాంతాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయినట్లు తాము గుర్తించామని అధికారులు చెబుతున్నారు. వాహనాలను ఓ క్రమపద్దతిలో కాకుండా ఇష్లానుసారంగా పార్క్ చేయటం, చెత్తచెదారాలను పడేయటంతో పాటు తాత్కాలిక మార్కెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే రాత్రివేళలో పార్క్ చేసిన వాహనాల్లోనే నిద్రిస్తున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. కొందరు వాహనదారులు తమ వాహనాలను శాండీ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి చాలాకాలం పాటు వాటిని తీయటం లేదన్నారు. ఇవన్నీ మున్సిపాలిటీ ప్రతిష్టను, అహ్లాదకర వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని...అందుకే వాటిని మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దాదాపు 25 పార్కింగ్ స్థలాలను గుర్తించామని ఇక నుంచి ఆయా పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయకుండా మూడ్రోజులుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com