నాంది మూవీ రివ్యూ

- February 19, 2021 , by Maagulf
నాంది మూవీ రివ్యూ

రివ్యూ : నాంది తారాగణం : 'నాంది'నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, నవమి, ప్రియదర్శి, ప్రవీణ్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ అయ్యంగార్ సినిమాటోగ్రఫీ: సిధ్ సంగీతం : శ్రీ చరణ్ పాకాల నిర్మాత : సతీష్ వేగేశ్న దర్శకత్వం : విజయ్ కనకమేడల అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ఆ స్థాయిలో రాణించాడు. ఆ ఇమేజ్ తోనే చాలా తక్కువ టైమ్ లోనే యాభై సినిమాలూ పూర్తి చేసుకున్నాడు. కామెడీ నటుడు అన్న ఇమేజ్ ఉన్నా.. తనలోని మరో యాంగిల్ ను గమ్యం, ప్రాణం, నేను అనే సినిమాల ద్వారా అప్పుడప్పుడూ చూపించాడు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్ ఈ సారి చాలా సీరియస్ సబ్జెక్ట్ తో వచ్చాడు. తన కెరీర్ మార్పుకు నాందిగా వచ్చిన నాంది సినిమా ఇవాళ విడుదలైంది. మరి నరేష్ కెరీర్ కు ఈ సినిమా ఎలా ఉపయోగపడుతుంది...? ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే నాంది సొసైటీకి కొత్త సందేశం ఇస్తుందా..?

థ: సూర్యప్రకాష్( అల్లరి నరేష్) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. తల్లిదండ్రులతో కలిసి హ్యాపీగా ఉంటాడు. ఓ గుడిలో ఓ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. కొంత టీజింగ్ తర్వాత తనూ నరేష్ ను ప్రేమిస్తుంది. నిజానికి ఈ ఇద్దరి ఇళ్లలో ఆల్రెడీ పెళ్లి కుదిర్చి ఉంటారు. ఎంగేజ్మెంట్ అవుతుంది. పెళ్లికి రెడీ అవుతూ.. ఓ కొత్త ఫ్లాట్ కూడా తీసుకుంటాడు. ఆ ఆనందంలో ఇంటికి వస్తోన్న సూర్యం ను పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. జాతీయస్థాయిలో గొప్ప వ్యక్తిగా పేరున్న పౌరహక్కుల నేత రాజగోపాల్ ను హత్య చేశావంటూ కేస్ లో ఇరికించి జైల్లో పెడతారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఐదేళ్ల పాటు జైళ్లో ఉన్న సూర్యంకు లాయర్ ఆద్య(వరలక్ష్మి శరత్ కుమార్) బెయిల్ ఇప్పిస్తుంది.. తర్వాత తనను అన్యాయంగా కేస్ లో ఇరికించిన పోలీస్ లపై సూర్యం రివెంజ్ తీర్చుకున్నాడా..? అసలు రాజగోపాల్ ను చంపింది ఎవరు..? ఎందుకు..? అమాయకులపై అకారణంగా కేస్ లు పెట్టిన పోలీస్ లపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సెక్షన్ 211 ఎలా ఉపయోగపడుతుంది అనేది మిగతా కథ.

అల్లరి నరేష్ ను అల్లరి ఇమేజ్ తోనే చూశారు ఇప్పటి వరకూ. కానీ నాంది చూసిన తర్వాత ఖచ్చితంగా ఇకపై నాంది నరేష్ అనే పిలుస్తారు. ఆ స్థాయిలో తన నటన కనిపిస్తుంది. ఎవరూ ఊహించని స్థాయి నటన చూపించాడు. అయితే ముందుగా ఈ సినిమాకు సంబంధించి మెచ్చుకోవాల్సింది దర్శకుడు విజయ్ కనకమేడల గురించి. ఇది అతని తొలి సినిమా. అయినా ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా తను చెప్పాలనుకున్న పాయింట్ ను అద్భుతంగా రాసుకున్నారు. దేశంలో 68శాతం ఖైదీలు అండర్ ట్రైయల్ ఖైదీలుగానే ఉన్నారు. చేసిన నేరానికి అనుభవించే శిక్షకు సంబంధం లేకుండా ఏళ్లతరబడి జైళ్లో మగ్గుతుంటారు. అలాంటి వారి కోసం కూడా మన న్యాయశాస్త్రంలో సరైన సెక్షన్స్ ఉన్నాయని సామాన్య జనానికి తెలిసేలా.. రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకూ తెలుగు సినిమాలో కనిపించని కోణం ఇది. అయినా నరేష్ ఇమేజ్ ను బట్టి కాకుండా తను నమ్మిన కథ చుట్టూనే కథనం రాసుకున్నారు.

ఇలాంటి కథలు డీల్ చేయాలంటే ఓ ఖచ్చితమైన స్టడీ అవసరం. చట్టంలోని లొసుగులు చూపించడం ఓ ఎత్తైతే.. చట్టాన్ని కాపాడాల్సిన వారిపైనే చట్టపరంగా శిక్షలు వేసే అంశాన్ని డీల్ చేయడం ఓ ఎత్తు. ఈ విషయంలో డైరెక్టర్ అండ్ టీమ్ ఎప్రిసియేట్ చేయాల్సిందే. అద్భుతమైన హోమ్ వర్క్ చేశారు. సినిమాకు సామాజిక బాధ్యత ఉంటే ఎంత గొప్పగా తెరపై చూపించవచ్చో తెలియజేశారు. కథనం సీరియస్ గా ఉన్నా ఇదేమీ డాక్యుమెంటరీని తలపించదు. నరేష్ పాత్రపై ప్రేక్షకుడిలో చాలా త్వరగానే సింపతీ క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి అతని పెయిన్ ను ఆడియన్ ఫీలవుతాడు. అది చాలు.. అతను ఎంగేజ్ కావడానికి. అది చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

అయితే రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. అలాగని బోర్ కొట్టదు. వాళ్ల జానర్ కాదు అనుకోవడమే. ఇక ఇదే తరహాలో ఓ మళయాల సినిమా వచ్చింది. అయితే ఇక్కడ 'లా'లోని ఒకే చట్టం గురించి చర్చించినప్పుడు సిమిలారిటీస్ కామన్. కానీ క్యారెక్టరైజేషన్స్ పూర్తిగా భిన్నమైనవి. అలాగని అస్సలు మైనస్ లే లేవా అంటే ఉన్నాయి. రాజగోపాల్ హత్యకు చూపించిన కారణం మరీ సహేతుకంగా కనిపించదు. అయినా పెద్ద మైనస్ కాదు. అలాగే సెకండ్ హాఫ్ కొంత లాగ్ అయినట్టు అనిపించినా.. కోర్ట్ రూమ్ డ్రామా మాత్రం పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ గా కాక కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మొత్తంగా నాంది.. మారుతున్న తెలుగు సినిమాకు సరికొత్త నాందిగా మారుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. నరేష్ తన పాత ఇమేజ్ తాలూకూ వాసనలు ఎక్కడా కనిపించనివ్వలేదు. ఓ సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడిగా.. అకారణంగా శిక్ష పడినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. తను చేయని నేరం ఒప్పుకోకుండా న్యాయం కోసం పోరాటం చేసిన యువకుడుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఈ సినిమాతో తనలో ఎంత గొప్ప నటుడున్నాడో ప్రూవ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా పరిశ్రమ మొత్తం అతని నటనకు ఫిదా అవుతుంది.

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది వరలక్ష్మి శరత్ కుమార్ గురించే. తను కనిపించగానే థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. అందుకు క్రాక్ సినిమాలోని జయమ్మ పాత్ర ఎఫెక్ట్ ఉన్నా.. చాలా కొద్ది సమయంలోనే ఆమెలోని పవర్ ఫుల్ యాక్ట్రెస్ ను చూస్తారు. లాయర్ ఆద్యగా అద్భుత నటనతో మెప్పిస్తుంది. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ సాగుతుంది. పోలీస్ పాత్రలో కనిపించిన హరీష్ ఉత్తమన్ ఎప్పట్లానే బాగా చేశాడు. ప్రియదర్శి, ప్రవీణ్ పాత్రలు కూడా ఓ దశలో సీరియస్ గా మారి కథలో లీనం అయిపోతాయి. ఇతర పాత్రల్లో నరేష్ తండ్రిగా నటించిన దర్శకుడు దేవీ ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ పాత్రలో మధ్యలోనే కట్ అవుతుంది. ఉన్నంతలో బానే ఉంది. టెక్కికల్ గా సినిమాటోగ్రపీ సూపర్బ్. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సెట్స్, ఆర్ట్ వర్క్, డైలాగ్స్ అన్నీ బాగా కుదిరాయి. ఫైనల్ గా ఇది దర్శకుడి సినిమా. రాసుకున్న కథను అంతే హానెస్ట్ గా తెరకెక్కించడం అంత సులువు కాదు. అతనికి సులువైందీ అంటే అది నిర్మాతల ధైర్యం. ఆ ధైర్యాన్ని నిలబెట్టుకునేలా దర్శకుడు చేసిన ప్రయత్నానికి నరేష్ నటన మరో ఎండ్ లో నిలబడింది. 

ఫైనల్ గా : సరికొత్త తెలుగు సినిమాకు నాంది 

మాగల్ఫ్  రేటింగ్ : 3.25/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com