డీ-హైడ్రేట్ కాకుండా ఉండాలంటే...

- March 26, 2021 , by Maagulf
డీ-హైడ్రేట్ కాకుండా ఉండాలంటే...

ఎండాకాలంలో డీ-హైడ్రేట్ కాకుండా ఉండాలంటే...ఈ ఐదు పండ్లు తింటే మంచిది.!

కర్బుజ..
శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా నీటిశాతాన్ని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లలో అతి ముఖ్యమైన ఫలం కర్బూజ. అందుకే ఎండాకాలంలో ఎక్కువగా తినమని నిపుణులు సూచిస్తుంటారు. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే మలబద్దకం సమస్య దూరమవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. మూత్ర సంబంధిత వ్యాధులు, సమస్యలు తగ్గుతాయి. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అలసట, బీపీ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

పుచ్చకాయ..

ఎండ వేడిని.. దాహార్తిని తీర్చడం లో పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక దీనిలో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. ఆ సమయంలో పుచ్చకాయ మంచి ఆహారం.

స్ట్రాబెర్రీ..
దాహార్తిని తీర్చడంలో స్ట్రాబెరీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో 91 శాతం నీరు ఉంటుంది. ఈ పండ్లలో ఉండే పీచు పదార్ధాల వల్ల ఏ, సీ, బీ6, బీ9, ఈ, కె విటమిన్లు మన శరీరానికి లభిస్తాయి. రక్తంలో కొవ్వును తగ్గించడమే కాకుండా క్యాన్సర్‌ను తగ్గించడంలో కూడా ఈ స్ట్రాబెర్రీ దోహదపడుతుంది.

పైనాపిల్..
పైనాపిల్‌లో నీటి మోతాదు 87 శాతం. ఈ పండు తినడం వల్ల శరీరానికి అనేక విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఈ పండు వల్ల శరీరంలోని వ్యర్ధాలు బయటికి వస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంపై ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాంగా ఉండేలా చేస్తుంది.

కీరా దోస..
ఎండాకాలంలో మనం డీహైడ్రేట్‌ నుంచి బయటపడాలంటే కీరా దోస తినడం ఎంతో అవసరం. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఈ కీరా దోస తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు చర్మ సౌందర్యం కోసం కూడా ఈ పండును ఉపయోగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com