మెట్రోరైల్ ప్రాజెక్టులోనూ రైల్వేక్రాసింగ్‌లు

- March 02, 2016 , by Maagulf
మెట్రోరైల్ ప్రాజెక్టులోనూ రైల్వేక్రాసింగ్‌లు

 మెట్రోరైల్ ప్రాజెక్టులోనూ రైల్వేక్రాసింగ్‌లు ఉండబోతున్నాయి. మూడు కారిడార్లను అనుసంధానం చేస్తూ.. మూడు సర్వీస్‌కారిడార్లను నిర్మించబోతున్నారు. కారిడార్-1, 3లను కలుపుతూ మైత్రీవనం వద్ద స్వర్ణజయంతి కాంప్లెక్ల్ ఎదుట, కారిడార్-3 కారిడార్-2లను కలుపుతూ సికింద్రాబాద్ బోయిగూడ వద్ద, కారిడార్-2, కారిడార్-1లను కలుపుతూ ఎంజీబీఎస్ వద్ద మూసీనదిలో సర్వీస్ కారిడార్లను నిర్మించనున్నారు. సుమారుగా 250 మీటర్ల విస్తీర్ణం గల ఈ కారిడార్‌లు రెండు కారిడార్లను అనుసంధానం చేస్తాయి. గతంలో ఇలాంటి ప్రయోగం మెట్రోలో చేయలేదు. ఏ కారిడార్‌లో తిరిగే రైళ్లు ఆ కారిడార్‌కు మాత్రమే పరిమితమవుతాయి. రైల్వే వ్యవస్థలో ఉన్నట్లుగా ఒక మార్గం నుంచి, మరో మార్గానికి రైళ్లు మారడానికి అవకాశం లేదు.రైళ్లు ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌లోని మారకుండా నిర్దేశించిన మార్గంలో మాత్రమే తిరిగే అవకాశం ఉండేది. కారిడార్-1లోని రైళ్లు ఒకటో కారిడార్‌లోనే, కారిడార్-3లోని రైళ్లు మూడో కారిడార్‌లోనే పరుగులు పెట్టడానికి వీలుంది. కాని కారిడార్-1 నుంచి రైళ్లు కారిడార్-2లోకి మారడానికి ఎలాంటి అవకాశం లేకుండే. కాని ప్రస్తుత డిజైన్ల మేరకు రైళ్లు మూడు కారిడార్లలో తిరిగే అవకాశముంది. * మియాపూర్‌లో బయలుదేరిన రైలు శిల్పారామంవైపు వెళ్లాలంటే.. మైత్రీవనం వద్ద గల సర్వీస్ కారిడార్ నుంచి అమీర్‌పేట స్టేషన్ వరకు వచ్చి.. ట్రాక్ మార్చుకుని, శిల్పారామం వైపు వెళ్లొచ్చు.* జేబీఎస్ నుంచి బయలుదేరిన మరో రైలు.. సికింద్రాబాద్ వెస్ట్ మెట్రోస్టేషన్ నుంచి చిలకలగూడ వరకు గల 250 మీటర్ల వ్యవధి గల సర్వీస్ కారిడార్‌తో నాగోలువైపు ప్రయాణాన్ని మార్చుకోవచ్చు.* ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన మరోరైలు.. ఎంజీబీఎస్ వద్దకు వచ్చి.. అక్కడే నిర్మించిన సర్వీస్ కారిడార్ ద్వారా ట్రాక్ మార్చుకుని, ఫలక్‌నుమా వైపు పోవచ్చు.మదర్ డిపోతోనే.. మెట్రోలో రైళ్లలన్నింటిని ఉప్పల్‌లోని మదర్ డిపో నుంచి ఆపరేట్ చేయనున్నారు. 72 కిలోమీటర్ల వ్యవధిలోని మూడు కారిడార్లలో తిరిగే రైళ్లన్నీ ఉప్పల్ డిపోలోని కంట్రోల్ సెంటర్ ఆధారంగానే నడుస్తాయి. మొత్తం 57 రైళ్లు ఉప్పల్ డిపో ఆధారంగానే నడుస్తాయి. పైగా మెట్రోరైల్ వర్క్‌షాపును సైతం ఇక్కడి డిపోలోనే ఏర్పాటు చేశారు. మూడు కారిడార్ల కోసం ఉప్పల్ డిపోలోనే మిగతా కారిడార్లకు డిపోలను నిర్మిస్తున్నా.. అవి రైళ్లను నిలుపుకోవడానికి, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, శుభ్రం చేయడానికే పరిమితం కానున్నాయి. ఫలక్‌నుమా, మియాపూర్‌లలో డిపోలున్నా.. వాటిని స్టేబ్లింగ్‌యార్డులుగా, వాషింగ్ ప్లాంట్లుగా మాత్రమే వినియోగించుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. మెట్రోరైళ్లు డ్రైవర్‌లేకుండా, ఆటోమెటిక్ రైళ్లు కావడం.. అవన్నీ.. ఉప్పల్ డిపో నుంచి ఆపరేట్ కావడంతో మిగతా మార్గాల్లో రైళ్లు నడపాలంటే సర్వీస్ కారిడార్లు తప్పనిసరిగా మారాయి. ఇందుకోసం రైళ్లు ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌కు మారాల్సి ఉంటుంది. దీంతో కారిడార్ల అనుసంధానం తప్పనిసరిగా భావించిన ఎల్‌అండ్‌టీ వర్గాలు డిజైన్లలో స్వల్పమార్పులు చేసి సర్వీస్ కారిడార్లను నిర్మిస్తున్నాయి. ఈ సర్వీస్ కారిడార్లు, ఒక కారిడార్‌తో మరో కారిడార్‌ను అనుసంధానం చేయనున్నాయి. ఏ కారిడార్‌లో తిరిగే రైళ్లనైనా.. ఉప్పల్ డిపోకు రాకపోకలు సాగించేలా సర్వీస్ కారిడార్లు ఉపయోగపడబోతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com