చంద్రబాబు నాయుడుకు ముద్రగడ పద్మనాభం హెచ్చరిక...

- March 03, 2016 , by Maagulf
చంద్రబాబు నాయుడుకు ముద్రగడ పద్మనాభం  హెచ్చరిక...

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం డెడ్ లైన్ విధించారు. ఈ నెల 10వ తేదీలోపు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 11 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం శుక్రవారం కిర్లంపూడిలో తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన దీక్ష సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబుపై ముద్రగడ నిప్పులు చెరిగారు. తాను లేఖ రాస్తేనే కాపులకు ఇచ్చిన హామీలు చంద్రబాబుకు గుర్తుకొచ్చాయన్నారు. కాపులకు ఇచ్చిన హామీలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు.సీఎం అయిన తర్వాత కాపుల హామీలను చంద్రబాబు విస్మరించారన్నారు. కాపులకు తక్షణం రూ.500 కోట్ల రుణాలు మంజూరు చేస్తామన్నారని, లోతైన పరిశీలన జరిగే వరకూ అరెస్టులు ఉండవన్నారని ముద్రగడ గుర్తు చేశారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ రుజాలు మంజూరు చేయాలన్నారు. ప్రతి ఏటా రూ.1000 కోట్లు బడ్జెట్ లో ఇవ్వాలని, రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలకు స్థానం ఉండకూడదన్నారు. అలాగే మండలాల వారీగా రుణాలు మంజూరు చేయాలని ముద్రగడ సూచించారు.గత డిసెంబర్ నుంచి 9 నెలల్లోపు మంజునాథ కమిటీ నివేదిక ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ అంశంపై చంద్రబాబు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, లేదంటే ఈ నెల 11వ తేదీ ఉదయం నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన తెలిపారు. తన ఫోన్లన్నీ ముఖ్యమంత్రి ట్యాప్ చేయిస్తున్నారని, ప్రశ్నిస్తే తనపై ఎదురు దాడి చేస్తారా? అని ముద్రగడ మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉండి అబద్ధాలు నిజమైపోతాయా అని ప్రశ్నించారు. కులాలను ప్రోత్సహించింది మీరు కాదా చంద్రబాబుగారూ?, మా సమస్యలపై రోడ్డెక్కితే తప్పు ఎలా అవుతుందని ముద్రగడ ప్రశ్నలు సంధించారు. కాపు జాతిని అవమానిస్తే సహించేది లేదని, వాగ్దానాలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలనే అడుగుతున్నామని, కొత్తగా ఏమీ అడగడం లేదని ముద్రగడ అన్నారు. రిజర్వేషన్లు భిక్ష కాదని, తమ హక్కు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకని ముద్రగడ ప్రశ్నించారు. మెడపై తుపాకులు పెట్టి భూములు లాక్కుంటున్నారన్నారు. పచ్చ చొక్కాలున్నవారికే పనులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com