ఇలాగైతే టి-20 వరల్డ్‌ కప్ ఆడబోం : పాకిస్థాన్

- March 04, 2016 , by Maagulf
ఇలాగైతే టి-20 వరల్డ్‌ కప్ ఆడబోం : పాకిస్థాన్

 పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి బెదిరింపులకు దిగింది. ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్‌ ఆడనుందని భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, లేదంటే తాము మెగాటోర్నీ నుంచి తప్పుకొంటామని హెచ్చరించింది.ఇప్పటికే ధర్మశాలలో ఈ నెల 19న జరుగనున్న భారత్‌-పాకిస్థాన్ మ్యాచుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ మ్యాచును హిమాచల్ ప్రదేశ్‌ మాజీ జవాన్లు వ్యతిరేకిస్తుండటంతో వేదిక మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పీసీబీ మరో మెలిక పెట్టింది. టీ-20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పాల్గొంటున్న విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాలని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌ కోరారు.'భారత్‌కు వచ్చేందుకు మాకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. మేం కూడా రావాలనుకుంటున్నాం. కానీ మాకు భరోసా కావాలి. ఈ విషయమై వారు ఒక ప్రకటన చేస్తే మాకు భద్రత కల్పించగలరని భరోసా లభిస్తుంది. నేను బీసీసీఐతో మాట్లాడాను. వారు ప్రైవేటుగా భరోసా ఇస్తున్నారు. అంతర్గత రాజకీయాల వల్ల బహిరంగ ప్రకటన చేయలేమంటున్నారు. పాక్ జట్టు రావాలని కోరుతున్నారు. కానీ, బహిరంగ ప్రకటన తప్పకుండా ఇవ్వాల్సిందే. కొన్ని బెదిరింపులు వస్తున్నాయి. అవి మా దృష్టికీ వచ్చాయి. దీనిపై ఐసీసీకి లేఖ రాశాం. మాకు భద్రత కల్పించి భరోసా ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరాం. ఇందుకు ప్రకటన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. దీనిపై చివరినిమిషం వరకు వేచిచూస్తాం. ప్రకటన రాకపోతే చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడం' అని షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ధర్మశాలలో భారత్‌-పాక్ మ్యాచుపై సందిగ్థత తొలగించేందుకు బీసీసీఐ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com