కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలను ఆన్‌లైన్‌ లో అప్‌లోడ్‌ చేయండి : NCPCR

- May 30, 2021 , by Maagulf
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలను ఆన్‌లైన్‌ లో అప్‌లోడ్‌ చేయండి : NCPCR

ఢిల్లీ: దేశంలో కోవిడ్ ప్రభావంతో చిన్నారులకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా; సంరక్షణ, భద్రత అవసరమైన పిల్లల కోసం “బాల్‌ స్వరాజ్‌ (కొవిడ్‌ సంరక్షణ లింక్‌)” పేరుతో ఓ ఆన్‌లైన్ ట్రాకింగ్ పోర్టల్‌ను జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌) తీసుకొచ్చింది. బాలల న్యాయ చట్టం-2015లోని సెక్షన్‌ 109 ప్రకారం సంక్రమించిన బాలల హక్కుల పర్యవేక్షణ యంత్రాంగ విధుల్లో భాగంగా ఈ పోర్టల్‌కు రూపకల్పన చేసింది. సంరక్షణ, భద్రత అవసరమైన పిల్లల ఆన్‌లైన్ ట్రాకింగ్, డిజిటల్ రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం ఈ పోర్టల్‌ను కమిషన్ తీసుకొచ్చింది.

కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయిన చిన్నారుల వివరాలను సేకరించడానికి కూడా ఈ పోర్టల్‌ పరిధిని విస్తరించి, “కొవిడ్‌ సంరక్షణ” పేరిట ఒక లింకును ఇచ్చింది. సంబంధిత అధికారులు లేదా విభాగాలు ఆ తరహా చిన్నారుల వివరాలను ఈ లింకు ద్వారా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. కుటుంబ మద్దతు లేని, జీవనాధారం లేని చిన్నారులను సంరక్షణ, భద్రత అవసరమైనవారిగా బాలల న్యాయ చట్టం-2015లోని సెక్షన్‌ 2(‍14)‌ ప్రకారం గుర్తించాలి. అలాంటి చిన్నారుల శ్రేయస్సు, భద్రత కోసం చట్టంలో సూచించిన అన్ని విధానాలను పాటించాలి.

కొవిడ్‌ ప్రభావిత చిన్నారులను బాలల సంరక్షణ సంఘం (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరచడం దగ్గర నుంచి, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులకు అప్పగించడం, తర్వాత కూడా వారిని పర్యవేక్షించడం “బాల్ స్వరాజ్-కొవిడ్ కేర్” పోర్టల్ లక్ష్యం. జిల్లా, రాష్ట్ర అధికారులు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన ప్రతి చిన్నారి సమాచారం ప్రకారం, అతడు,ఆమె తన అర్హతల ప్రకారం ఆర్థిక, ఇతర ప్రయోజనాలను పొందగలరా, లేరా అనే అంశాన్ని కమిషన్ నిర్ధరించుకుంటుంది. సీడబ్ల్యూసీ ఎదుట బాలుడు, బాలికను ప్రవేశపెట్టారా.? వారి కోసం ఆదేశాలు జారీఅవుతున్నాయా..? లేదా అన్నది కూడా తెలుసుకుంటుంది. బాలల పథకాల అమలుకు రాష్ట్రాలకు మరిన్ని నిధులు అవసరమైతే కమిషన్‌ ఆ విషయాన్ని కూడా గుర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com