మనోరంజకంగా సాగిన 'జనరంజని' ముంబై, ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

- June 21, 2021 , by Maagulf
మనోరంజకంగా సాగిన \'జనరంజని\' ముంబై, ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

ముంబై: ముంబై ప్రధాన కేంద్రంగా నెలకొల్పబడిన ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ "జనరంజని" తొలి వార్షికోత్సవ వేడుకలు అంతర్జాల వేదిక పై 19, 20 తేదీల్లో ఘనంగా జరిగాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు సింగపూర్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ నుండి కూడా అతిథులు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కనులవిందుగా జరిగిన ఈ కార్యక్రమంలో జీవీఎల్ నరసింహారావు, బుచ్చి రాంప్రసాద్, వామరాజు సత్యమూర్తి, కామర్స్ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ రాజకీయవేత్తలు, తెలుగు సంస్కృతి పోషకులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. 

జనరంజని వ్యవస్థాపకులు రుద్రాభట్ల రామ్ కుమార్ మాట్లాడుతూ "గత సంవత్సర కాలంగా జనరంజని తరఫున ఎన్నో సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, సభ్యులందరి సహకారంతో మరిన్ని చక్కటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని" తెలిపారు. అమెరికా నుండి రమేష్ దేశిభొట్ల, సింగపూర్ నుండి కవుటూరు రత్న కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు.

శ్రీశ్రీశ్రీ మలయాళ లలితాంబికా తపోవనం పీఠాధిపతి పూజ్యశ్రీ సర్వేశ్వరానందగిరి స్వామీజీ  జ్యోతి ప్రకాశనం గావించి కార్యక్రమం ప్రారంభించగా, ప్రముఖ నేపథ్య గాయని దివాకర్ల సురేఖ మూర్తి, సుమధుర గాయకులు నేమాని పార్థసారథి మరియు వారి శిష్య బృందం చక్కటి సినీ లలిత గీతాలతో అలరించారు.  బెంగళూరు నుండి శ్రీ ప్రహ్లాద ఆచార్య  "షాడో షో" లో నీడలతో తెరపై బొమ్మలను ప్రదర్శించిన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 హాస్యబ్రహ్మ శంకరనారాయణ  తమ చక్కటి హాస్య ప్రసంగంతో నవ్వులు కురిపించగా, మండా వరలక్ష్మి హరికథాగానం, కుమారి పగడాల శృతి జానపద గీతాలు, వేముల రంగారావు మురళీవాదన, సింగపూర్ నుండి గుంటూరు వెంకటేష్ ఈల పాటలు, అత్తిలి అనంతరామ్ హాస్య కథానిక, చిన్నారుల నృత్యాలు మొదలైన అంశాలు అందరిని ఎంతో అలరించాయి.

 రాధిక మంగిపూడి, కస్తూరి శివశంకర్, శ్రీలేఖ వారణాసి, దశక చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, కంభంపాటి మాధవరావు వందన సమర్పణ చేశారు. స్వర మీడియా మరియు ట్రైనెట్ వారు మీడియా భాగస్వాములుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్బుక్ మరియు "స్వర రేడియో" ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. 

కార్యక్రమాన్ని వీక్షించుటకుhttp://https://youtu.be/UWsZLXPKGz8

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com