సౌదీ నుంచి వచ్చిన భారతీయుడి వద్ద భారీగా బంగారం పట్టివేత
- September 08, 2021
లక్నో: విదేశాల నుంచి అక్రమ మార్గంలో బంగారం స్మగ్లింగ్ చేసేవారు రోజుకో కొత్తమార్గంలో దేశానికి పసిడిని పట్టుకొస్తున్నారు. చివరకు కస్టమ్స్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్ పట్టుబడుతున్నారు. కానీ, కొందరు మాత్రం అధికారుల కళ్లుగప్పొ లేదంటే వారికి ఎంతోకొంత మూటజెప్పొ విదేశాల నుంచి తెచ్చిన బంగారంతో బయటపడుతున్నారు. అయితే, బయటపడిన తర్వాత కూడా వారి అదృష్టం బాగాలేకపోతే మాత్రం చివరకు అధికారుల చేతికే చిక్కుతారు అనడానికి తాజాగా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకున్న ఘటననే నిదర్శనం. సౌదీలోని రియాధ్ నుంచి ఓ ప్రయాణికుడు ఏకంగా 9 కిలోల బంగారం తీసుకొచ్చాడు. దాని విలువ సుమారు రూ.4.50కోట్లు.
విమానాశ్రయంలో కస్టమ్ పోలీస్ సహాయంతో బయటపడిన అతగాడు.. చివరకు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే, డీఆర్ఐ అధికారులకు సదరు స్మగ్లర్ అంతా ఈజీగేమీ దొరకలేదు. క్రైమ్ సినిమా స్టోరీ తరహాలో అధికారులు అతగాడిని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. అనంతరం అతని నుంచి తొమ్మిది కిలోల బంగారం స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు.డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయానికి రియాద్ నుంచి భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు డీఆర్ఐ అధికారులకు ముందే సమాచారం అందింది. దాంతో ఉదయం నుంచే అధికారులు అలర్టై..విమానాశ్రయం వద్ద నిఘా పెట్టారు.
రియాద్ నుంచి వచ్చిన విమానంలోంచి దిగిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించాడు. విమానం దిగిన తర్వాత సదరు ప్రయాణికుడు విమానాశ్రయం బయటకు వచ్చి, అక్కడ ఆగి ఉన్న ఓ ఎస్యూవీ వాహనంలో ఎక్కాడు. దాంతో అధికారులు ప్రయాణికుడు ఎక్కిన కారును వెంబడించారు. చాలా సేపు చేజ్ చేసిన తర్వాత ఎట్టకేలకు ఆ వాహనాన్ని ఎక్స్‌ప్రెస్ వేపై అధికారులు ఆపారు. అందులో ఉన్న వ్యక్తిని తనిఖీ చేశారు. దాంతో అతడి వద్ద 77 బంగారు బిస్కెట్లు దొరికాయి.
లోదుస్తుల్లో జేబులాంటిది ఏర్పాటు చేసుకుని దాంట్లో వాటిని తీసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు. తొమ్మిది కిలోల బరువు గల వాటి విలువ సుమారు రూ. 4.50కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.అతడిని విచారించిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. తాను లక్నో విమానాశ్రయం నుంచి బంగారంతో బయటపడడానికి అక్కడ పనిచేసే ఓ కస్టమ్ పోలీస్ తనకు సహకరించినట్లు చెప్పాడు.అంతేగాక బంగారాన్ని ముజాఫర్‌నగర్ తీసుకెళ్తున్నట్లు చెప్పాడు.స్మగ్లర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు.. అతడ్ని పోలీసులకు అప్పగించారు. అలాగే అతనికి సాయం చేసిన కస్టమ్ పోలీస్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







