హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ : తెలంగాణ

- March 17, 2016 , by Maagulf
హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ :  తెలంగాణ

రూ.2500 కోట్ల పెట్టుబడి.. 4500 మందికి ఉపాధి 40 ఎకరాల స్థలం కావాలని ప్రతిపాదన  తెలంగాణ రాష్ట్రంలో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ ఎయిర్‌బస్‌ ఆసక్తిని కనబరిచింది. రూ.2500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. యేటా వంద నేవీ, యుటిలిటీ హెలికాప్టర్ల తయారీ సామర్థ్యం గల పరిశ్రమ కోసం 40 ఎకరాల భూమిని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇవ్వాలని కోరింది.గత నెల ముంబయిలో జరిగిన 'భారత్‌లో తయారీ' ప్రదర్శన సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను కలిసి తమ పరిశ్రమ గురించి ఎయిర్‌బస్‌ సంస్థ ప్రతినిధులు చర్చించారు. అధికారుల సూచనల ప్రకారం తాజాగా వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిసి తమ ప్రతిపాదనలను అందజేశారు. నేవీ హెలికాప్టర్ల కోసం భారత్‌లో భారీ గిరాకీ ఉందని, వాటిని ఇక్కడే తయారు చేసేందుకు తెలంగాణను ఎంచుకున్నామని వెల్లడించారు. టాటా లేదా మహీంద్రతో కలిసి ఈ పరిశ్రమను ప్రారంభించేందుకు యోచిస్తున్నామని ఎయిర్‌బస్‌ ప్రతినిధులు తెలిపారు. తమ పరిశ్రమ ద్వారా 4500 మందికి ఉపాధి లభిస్తుందని ఎయిర్‌బస్‌ తెలిపింది. దీంతో పాటు హెలికాప్టర్ల విడిభాగాలు, పరికరాల ఉత్పత్తికి 30 అనుబంధ పరిశ్రమలు వచ్చే వీలుంది. వీటి ద్వారా వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. హెలికాప్టర్ల నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాల (ఎంఆర్వో) కేంద్రం ఏర్పాటవుతుంది.ఎయిర్‌బస్‌ ఏమి కోరిందంటే... విమానాశ్రయానికి సమీపంలో రవాణా వసతులు, ట్రాఫిక్‌, పర్యావరణ సమస్యలు లేని ప్రాంతంలో 40 ఎకరాల భూమి కావాలి. ఇప్పటికే అది మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతమై ఉండాలి. ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా పరిశ్రమ నుంచి నేరుగా విమానాశ్రయం చేరుకోవాలి. పరిశ్రమ కోసం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కావాలి. నిరంతర విద్యుత్‌ను అందించాలి. ప్రత్యేకంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి. కార్మికుల రాకపోకలకోసం బస్‌, కారు, ఇతరవసతులు ఉండాలి. మూడు పార్కులు అనుకూలమే... తెలంగాణ ప్రభుత్వం: ఆదిభట్ల, నాదర్‌గుల్‌, ఎలిమినేడుల్లో తాము వైమానిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ మూడూ ఎయిర్‌బస్‌ సూచించిన విధంగానే ఉన్నాయని, ఇందులో పరిశ్రమకు భూములిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాంతాలను పరిశీలించి ఎంపిక చేస్తే భూమిని వెంటనే కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఎయిర్‌బస్‌ ఇతర ప్రతిపాదనలనూ ఆమోదిస్తామని పేర్కొంది. త్వరలోనే ఎయిర్‌బస్‌ ప్రతినిధుల బృందం స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com