కరోనాపై పోరాటంలో వైద్యుల సేవానిరతి మరువలేనిది: ఉపరాష్ట్రపతి

- October 11, 2021 , by Maagulf
కరోనాపై పోరాటంలో వైద్యుల సేవానిరతి మరువలేనిది: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారతదేశం కరోనా మహమ్మారితో సాగించిన పోరాటంలో మొదటి వరస పోరాటయోధులుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్ర కీలకమని.. తమ జీవితాలను పణంగా పెట్టిన వైద్యుల సేవానిరతి మరువలేనిదని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అత్యుత్తమ సేవల అవార్డును ఏయిమ్స్ – ఢిల్లీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియాకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పారద్రోలి వారిని చైతన్య పరిచే విషయంలో ఏయిమ్స్ డైరెక్టర్ హోదాలో శ్రీ గులేరియా కీలకంగా వ్యవహరించారన్నారు. కరోనాపై పోరాటంలో మొదటి వరుస పోరాట యోధులను ముందుకు నడిపించడంలో కమాండర్ ఇన్ చీఫ్ పాత్రను శ్రీ గులేరియా పోషించారన్నారు.

ఏయిమ్స్ ఆసుపత్రిలోనూ.. తమ విభాగమైన ఛాతీ సంబంధిత వైద్య విభాగంతోపాటు మొత్తం ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరించారని ఉపరాష్ట్రపతి అభినందించారు.

భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, క్రమశిక్షణ, జవాబుదారీ తనం, పారదర్శకత, హుందాతనంతో పాటు నిరాడంబరతకు శాస్త్రి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారన్నారు. వివిధ సందర్భాల్లో దేశ ప్రజల్లో నైతికతను పెంపొందించేందుకు వారు తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్ర గతిని మార్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చైర్మన్ అనిల్ శాస్త్రి, వారి కుటుంబసభ్యులు, పురస్కార గ్రహీత డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కుటుంబసభ్యులు, ఎల్‌బీఎస్ఐఎమ్ డైరెక్టర్ ప్రవీణ్ గుప్తా, అధ్యాపకులు, వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా వీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com