పోర్న్‌ సైట్లు వీక్షించే వారిపై తెలంగాణ పోలీసుల నిఘా..

- January 04, 2022 , by Maagulf
పోర్న్‌ సైట్లు వీక్షించే వారిపై  తెలంగాణ పోలీసుల నిఘా..

హైదరాబాద్: ఇంటర్‌నెట్‌లో పోర్న్ వీడియోల సైట్లను వీక్షించేవారి పై పోలీసు నిఘా అధికం చేయనున్నారు. మోబైల్, కంప్యూటర్, ఇంటర్‌నెట్ సెంటర్లలో పోర్న్ వీడియోలు చూసేవారితో పాటు ఆయా వీడియోలను షేర్ చేసేవారిని ఐపి ఆధారంగా గుర్తించి వారిపై ఐటి చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సన్నద్థమౌతున్నారు. ఈక్రమంలో ఇంటర్‌నెట్‌లో పోర్న్ సైట్లను వీక్షించే వారిని ఆయా ఇంటర్‌నెట్ ఐపి ఆధారంగా గుర్తిస్తూ ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. పోర్న్ సైట్ల వీక్షించడం వల్ల మహిళలపై లైంగిక వేధింపులు అధికమౌతున్నాయని భావించిన పోలీసు బాసులు వాటిని వీక్షించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమౌతున్నారు.ఇందులో భాగంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు పోర్న్ వీడియోలను తరచూ వీక్షించే వారిపై ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. పోర్న్ చిత్రాల వీక్షించిన వారిపై నేరం రుజువైన పక్షంలో వారిపై ఐటి యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు శిక్షలు తప్పవని పోలీసు బాసులు హెచ్చరిస్తున్నారు.

అదేవిధంగా పోర్న్ వీడియోలను వాట్సప్‌లలో షేర్ చేసేవారిపైనా చట్టరీత్యా చర్యలతో పాటు కేసులు నమోదు చేసేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా పోర్స్ వెబ్‌సైట్ల కారణంగా అఘాయిత్యాలు పెరుగుతున్నాయని పోలీసులు భావిస్తూ ఈ తరహా చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గంటల తరబడి ఫోన్లలో పోర్న్ వెబ్‌సైట్లలో మునిగి తేలుతున్న వారిపై పోలీసులు దృష్టి సారించనున్నారు.దీంతో పోర్న్ చూసే వారి కదలికలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచనున్నారు.అశ్లీల వీడియోలు చూసేవారు, వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వారు, షేర్ చేసే వారిపై నిఘాపెట్టారు. ఎవరు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు,షేర్ చేస్తున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.హెచ్చరించినప్పటికీ మారకుండా పోర్న్ వీడియోలు చూస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమౌతున్నారు. కేసులు నమోదు చేసిన తర్వాత వారికి శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com