ప్రకాశ్‌రాజ్ సమాజంలో అందరికీ స్పూర్తిదాత
- March 26, 2016
గ్రామజ్యోతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రసిద్ధ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సమాజంలో అందరికీ స్పూర్తిదాతగా పేర్కొంటూ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రశంసించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ప్రకాశ్‌రాజ్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రకాశ్‌రాజ్ కలెక్టర్‌కు వివరించారు. కొండారెడ్డిపల్లిలో విద్యాభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం అవసరమని, అదేవిధంగా విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామంలో మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికతీత, పాడుబడిన బావులను పూడ్చడం, ఇంకుడుగుంతల నిర్మాణం తదితర అభివృద్ధి, నిర్మాణాత్మక కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు.ప్రభుత్వ యంత్రాంగం ఈమేరకు తమకు సహకరించాలని ఆయన కోరారు. ప్రధానంగా పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థులు స్థానికంగా చదువుకునే ఆస్కారం ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుని గ్రామస్తుల విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్యం, పౌష్టికాహారం, సహజ వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో గ్రామాభివృద్ధికి ప్రణాళికా బద్దంగా కృషి చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ను సమాజంలో అందరూ స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. జిల్లాలో అక్షరాస్యత తక్కువగా ఉండటం, బాల్యవివాహాలు, మద్యపానం, సామాజిక అంశాలపై అవగాహన లోపం తదితర సాంఘిక దురాచారాలు ఉన్నాయని, వీటి నిర్మూలనకు అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రకాశ్‌రాజ్ స్పూర్తితో జిల్లాలోని వివిధ గ్రామాలను దత్తత తీసుకుని గ్రామీణాభివృద్ధికి పాటుపడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కమ్మదనంలో బోరు మోటారును ప్రారంభించిన ప్రకాశ్‌రాజ్.. ఫరూక్‌నగర్ మండలంలోని కమ్మదనం గ్రామంలో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై స్పందించి ఇటీవల ప్రకాశ్‌రాజ్ తన పేరునగల ఫౌండేషన్ నిధులతో బోరు వేయించి, శుక్రవారం మోటారును స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావం కారణంగా భూగర్భజలాలు అడుగంటిన నేపథ్యంలో గ్రామస్తులు ప్రతి నీటి బొట్టును వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు ప్రతి ఇంటిముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భజలం పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







