ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే శక్తి సామర్థ్యాలు మన దేశానికి పుష్కలంగా ఉన్నాయి:ఉపరాష్ట్రపతి
- March 06, 2022
హైదరాబాద్: భారతదేశ మౌలిక వసతుల వ్యవస్థను మరింత సమర్థమవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేటు రంగం ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పుష్కలమైన శక్తిసామర్థ్యాలు భారతదేశానికి ఉన్నందున ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటూ ఈ సుస్థిర ప్రగతి పథంలో భాగస్వాములు కావాలన్నారు. మౌలికవసతుల వృద్ధిద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్న ఉపరాష్ట్రపతి, ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణ నిర్మాణాన్ని నిర్మిస్తోందన్నారు. పారిశ్రామిక రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, పోటీభరిత వాతావరణంలో సృజనాత్మకంగా ముందుకెళ్తూ సంపదను పెంచుకోవడంతోపాటు ఉపాధి కల్పనకు బాటలు వేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
సీఈవో క్లబ్స్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన సదస్సుకు ఉపరాష్ట్రపతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సమన్వయం అవసరమని సూచించారు. డిజిటల్ సేవలు, తయారీ రంగం వంటి ఎన్నో రంగాల్లో మనదేశం వద్ద అపారమైన శక్తిసామర్థ్యాలున్నాయని కావాల్సిందల్లా వాటిని గుర్తించి, ప్రోత్సహించి సద్వినియోగపరుచుకోవడమేనని ఆయన అన్నారు.
కరోనానంతర పరిస్థితుల్లోనూ అన్నిరంగాల్లో సుస్థిరమైన అభివృద్ధి దిశగా భారత్ దూసుకుపోతోందన్న ఉపరాష్ట్రపతి, ఈ సుస్థిర ఆర్థిక ప్రగతిని కొనసాగించేందుకు అన్ని భాగస్వామ్య పక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాజా కేంద్ర బడ్జెట్ లో మూలధన వ్యయంలో స్వల్ప పెంపుదల కారణంగా ప్రైవేటు రంగం మరింతగా పెట్టుబడులు పెంచేందుకు బాటలు వేస్తోందని, తద్వారా పురోగతి జరగడంతోపాటు ఉపాధి కల్పనకు కూడా బాటలు పడతాయని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తంచేశారు.
‘ప్రధానమంత్రి గతిశక్తి ప్లాన్’ను ఉటంకిస్తూ రోడ్లు, రైల్వేలు, విమానమార్గాలు, పోర్టులు, భారీ ట్రాన్స్ పోర్టు, జలమార్గాలతోపాటు లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో సంపూర్ణమైన అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. దీంతో పాటుగా బహుముఖ అనుసంధాన (మల్టీమోడల్ కనెక్టివిటీ) పథకాల్లో భాగంగా 1,200 పారిశ్రామిక క్లస్టర్లు, డిఫెన్స్ కారిడార్లు, విద్యుత్ అనుసంధాన నెట్ వర్క్ లు, నౌకాశ్రయాల వద్ద కార్గో హాండ్లింగ్ కెపాసిటీ పెంచడం, ఎలక్ట్రానిక్ తయారీరంగ క్లస్టర్లు, మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటు, అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. 11 పారిశ్రామిక కారిడార్లతోపాటు 38 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు, 109 ఫార్మాసూటికల్ క్లస్టర్ల నిర్మాణం ద్వారా ఎంఎస్ఎమ్ఈ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
వస్త్ర, అటోమొబైల్, ఫార్మాసూటికల్స్, వైద్య పరికరాలు, టెలికాం, ఎలక్ట్రానిక్స్ మొదలైన 14 కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం’ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. దీంతోపాటు ఈ పథకం ద్వారా ఆయా రంగాల్లో 60 లక్షల వరకు కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
ప్రైవేటు రంగం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. సంపదను పెంచుకుని దాన్ని సమాజంతో పంచుకోవడం నేటి పరిస్థితుల్లో అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యరంగాల్లో అవసరమైన సహాయం అందించడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. దీంతోపాటుగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఆత్మనిర్భరతగా మార్చడంలోనూ ప్రైవేటు రంగం చొరవతీసుకోవాని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో సిఈఓ క్లబ్స్ అధ్యక్షులు కాళీప్రసాద్ గడిరాజు, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్ల, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్ల, ట్రెండ్ సెట్ బిల్డర్స్ చైర్మన్ డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







