క్రెడిట్ కార్డుల విషయంలో RBI కీలక ఆదేశాలు...కస్టమర్లకు ఊరట

- April 22, 2022 , by Maagulf
క్రెడిట్ కార్డుల విషయంలో RBI కీలక ఆదేశాలు...కస్టమర్లకు ఊరట

న్యూ ఢిల్లీ: కస్టమర్ల నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండా క్రెడిట్‌ కార్డులు జారీ చేయటం లేదా కస్టమర్ల ప్రస్తుత కార్డులను అప్‌గ్రేడ్‌ చేయడం లాంటివి చేయవద్దని కార్డ్‌ కంపెనీలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఈ రూల్స్ అతిక్రమిస్తే సదరు కంపెనీ కస్టమర్‌కు విధించిన బిల్లుకు రెట్టింపును జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని RBI హెచ్చరించింది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడవద్దని కార్డుల సంస్థలు, థర్డ్‌ పార్టీ ఏజెంట్లకు కీలక సూచనలు చేసింది. 2022 జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.

కొత్తగా రానున్న రూల్స్ ప్రకారం ఏ కస్టమర్ పేరు మీదైనా అడగకుండానే కార్డు జారీ చేసినట్లయితే.. వారు ఆ విషయాన్ని సదరు కార్డు సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. కంపెనీ నుంచి సరైన సమాధానం రాకపోతే RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుకు కలిగిన నష్టాన్ని సదరు కంపెనీ చెల్లించాల్సిన జరిమానా మెుత్తాన్ని అంబుడ్స్‌మన్‌ నిర్ణయిస్తారు. దీనిని లెక్కించేటప్పుడు సదరు వినియోగదారుడికి వృధా అయిన సమయం, అయిన ఖర్చులు, మానసిక ఆవేదన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

రూ. 100 కోట్లకు పైగా నెట్ వర్త్ కలిగిన కమర్షియల్‌ బ్యాంకులు స్వతంత్రంగా లేదా కార్డులు జారీ చేసే ఇతర బ్యాంకులు/NBFCలతో కలిసి క్రెడిట్‌ కార్డు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. స్పాన్సర్‌ బ్యాంక్‌ లేదా ఇతర బ్యాంకులతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా క్రెడిట్‌ కార్డులను తమ కస్టమర్లకు జారీ చేయవచ్చు. ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా NBFCలు .. డెబిట్, క్రెడిట్‌ కార్డులను మొదలైనవి జారీ చేయకూడదు. కార్డు జారీ సంస్థలు, సదరు సంస్థల ఏజెంట్లు.. బకాయిల వసూలు విషయంలో క్రెడిట్‌ కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులపై బెదిరింపులకు, వేధింపులకు పాల్పడకూడదని రిజర్వు బ్యాంక్ తన తాజా ఆదోశాల్లో స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com