ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు రైతుల పట్ల పక్షపాతం చూపాలి:ఉపరాష్ట్రపతి
- June 11, 2022
హైదరాబాద్: ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు రైతుల పట్ల పక్షపాతం చూపాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ చొరవ అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. మట్టిసారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అన్న ఆయన, ఈ విషయంలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. స్వతహాగా రైతు బిడ్డ అయిన ఆయన, చిన్నతనం నుంచి తమ తాతగారు చేసే పర్యావరణ హిత వ్యవసాయాన్ని చూస్తూ పెరిగానని, ఆ తర్వాత వచ్చిన మార్పులు తనను కాస్తంత ఆందోళనకు గురి చేశాయని, ఇప్పుడు మళ్ళీ క్రమంగా పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయంవైపు రైతులు మళ్ళుతుండడం ఆనందదాయకమని తెలిపారు.
రైతునేస్తం పబ్లికేషన్ వారు ప్రచురించిన “ప్రకృతిసైన్యం” పుస్తకాన్ని హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మళ్లీ పట్టం కడుతూ, విజయాలు సాధించిన 100 మంది రైతుల విజయ గాథలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమన్న ఆయన, ప్రచురణకర్త యడ్లపల్లి వెంకటేశ్వరరావుగారికి, పుస్తక రచయిత డి.ప్రసాద్ కి అభినందనలు తెలిపారు. తమ కృషితో ఈ పుస్తకంలో చోటు సంపాదించుకున్న రైతులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు.
బ్రిటీష్ వారి పాలనలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొందన్న ఉపరాష్ట్రపతి, స్వరాజ్య సాధన తర్వాత మన అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడంలో పర్యావరణాన్ని అశ్రద్ధ చేశామని, ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రకృతి వ్యవసాయంవైపు రైతులు మొగ్గుచూపడం ఆనందదాయకమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చన్న ఆయన, ఈ పద్ధతిలో ఏ వస్తువును బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, సేంద్రీయ ఎరువులను రైతే తయారు చేసుకోవచ్చని తెలిపారు. విద్యుత్, నీటి విషయంలో కూడా వాడకాన్ని తగ్గించి, పెట్టుబడిని తగ్గించుకో వచ్చని, పెట్టుబడి తగ్గిందంటే రైతు లాభం పెరిగినట్టేనని తెలిపారు. ప్రస్తుతం సేంద్రీయ పంటలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలోనూ ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
రైతులు ప్రకృతి వ్యవసాయానికి పూర్తిగా అలవాటు పడలేదన్న ఉపరాష్ట్రపతి, ఒక్కసారిగా పూర్తి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించకుండా, క్రమంగా భూమిలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయిస్తూరావలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి కావలసిన ద్రావకాలు, బయో ఎరువులు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్న ఆయన, ఈ పరిస్థితి మారాలంటే పశుసంపదనే దేశ సంపదగా భావించిన మన పెద్దల దృష్టి కోణాన్ని ఆకళింపు చేసుకోవాలని సూచించారు. పశువులను పెంచుకోవడం ద్వారా వ్యవసాయానికి కావలసిన ఎరువులు ఉచితంగా లభించడమే గాక, పాలు వంటి అదనపు ఆదాయ మార్గాలు కూడా సమకూరుతాయన్న ఉపరాష్ట్రపతి, వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే తప్ప, అనుబంధ రంగాల మీద దృష్టి పెట్టిన వారెవ్వరూ ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సాంకేతికత మీద కూడా దృష్టి కేంద్రీకరించాలన్న ఉపరాష్ట్రపతి, తృణధాన్యాలు, పప్పు ధాన్యాల మీదే కాకుండా రైతులు చిరు ధాన్యాల మీద కూడా దృష్టి సారించాలని సూచించారు. చిరుధాన్యాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని వినియోగించుకోవాలన్న ఆయన, ప్రకృతి వ్యవసాయం విషయంలో మరింత పరిశోధన జరగాల్సి ఉందని, శాస్త్రీయ పరిశోధనతో పాటు, ఆచరణాత్మక అనుభవాల ద్వారా దీన్ని దేశ వ్యాప్తంగా విస్తృతం చేయవలసి అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో స్వీకరించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల మధ్య దైనందిన సజీవ సంబంధాలు నెలకొల్పాలని తెలిపారు. ప్రకృతి సేద్యం విషయంలో మరిన్ని పరిశోధనలు జరగడమే గాక, వాటి క్షేత్ర స్థాయి అమలుకు చొరవ మరింత పెరగాలని సూచించారు.
యువతరం వ్యవసాయం వైపు మొగ్గడం చూస్తుంటే వ్యవసాయ రంగానికి పునర్వైభవం వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవని ఆశ కలుగుతోందన్న ఉపరాష్ట్రపతి, వ్యవసాయాన్ని లాభసాటిగా, ఆకర్షణీయంగా మార్చేందుకు చిత్తశుద్ధితో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. పార్లమెంట్, పార్టీలు, ప్రణాళికా సంఘాలు, నీతి ఆయోగ్, పత్రికలు, ప్రసార మాధ్యమాలు అన్నీ వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన, యువత కూడా ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు.కార్యక్రమం ప్రారంభంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో నార్మ్ సంచాలకులు శ్రీనివాస రావు, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ సంచాలకులు డా.ఎస్.రామచందర్, రైతునేస్తం పబ్లికేషన్స్ వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు సహా పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!







