కొత్త జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇప్పుడు కాదు.. అప్పుడే..!
- June 25, 2022
తెలంగాణ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వ్యూహ రచన చేస్తున్నారు.
బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తి రావాల్సి ఉందని పదే పదే చెబుతున్న కేసీఆర్.. ఆ బాధ్యతలను తానే తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే ప్రకటన చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. తెలంగాణలో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల కంటే ముందే పార్టీని ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ తాజా రాజకీయాల నేపథ్యంలో కొత్త పార్టీని ప్రకటనను వాయిదా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారట.
కొత్త జాతీయ పార్టీని రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే పార్టీ ప్రారంభించాలని భావించినప్పటికీ.. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలకు మరో మూడు వారాలకు పైగా గడువు ఉన్నందున... అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు చేయాలని నిర్ణయించారట. జూన్ 10న ప్రగతిభవన్‌లో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఆ భేటీలో కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించారు. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేద్దామని చెప్పారు. అందుకు గులాబీ నేతలంతా ఓకే చెప్పారు. పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ఖరారు చేశాక.. ఈ నెల 19న టీఆర్ఎస్ కార్యకర్గ సమావేశం ఏర్పాటు చేసి.. కొత్త జాతీయ పార్టీపై తీర్మానం చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల గురించే చర్చ జరుగుతున్నందున... కొత్త జాతీయ పార్టీని ఎన్నికల తర్వాతే ప్రకటించాలని సీఎం భావిస్తున్నారట.
మరోవైపు కొత్త జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. దేశంలోని ప్రముఖ ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం కూడా ప్రగతి భవన్‌లో ఓ సమావేశం జరిగింది. ఢిల్లీకి చెందిన ఆర్థిక నిపుణుల బృందంతో ఆయన చర్చలు జరిపారు. శుక్రవారం జాతీయ మీడియా ప్రముఖులతోనూ భేటీ అయ్యారు. ఇలా పలు రంగాలకు చెందిన నిపుణులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం వరకు ఈ చర్చలు కొనసాగుతాయి. పూర్తి స్థాయిలో కసరత్తు చేశాక.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత.. కొత్త జాతీయ పార్టీని ఘనంగా ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేలా వ్యూహాలను రచిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







